పంట తొలగింపుపై ఆందోళన
- భూములను రిజిస్ట్రేషన్ చేయలేదన్న రైతులు
- చేసినవేనని హిమామి సిమెంట్స్ యజమాన్యం వెల్లడి
తంగెడ(దాచేపల్లి): మండలంలోని తంగెడ, సారంగపల్లి అగ్రహారం, మాదినపాడు, ముత్యాలంపాడు గ్రామాల్లో రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లోని పత్తి, మిరప పంటలను హిమామి సిమెంట్స్ సిబ్బంది శనివారం ట్రాక్టర్లు, పొక్లెయిన్‌తో తొలగించారు. దీంతో రైతులు పొలాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు పాడి రామకోటయ్య, మాదినపాడు జానీ, మాడుగుల సైదావలి, కందుల సాల్మాన్, కందుల ఏసు, లింగిరి నాగుల్‌మీరా, గోపి దావీదులు మాట్లాడుతూ 2010 నవంబర్‌లో హిమామి సిమెంట్స్ యాజమాన్యం తంగెడ, ముత్యాలంపాడు, సారంగపల్లి అగ్రహారం, మాదినపాడు గ్రామాల్లో 800 ఎకరాలను కొనుగోలు చేసేందుకు వచ్చిందని తెలిపారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న భూములతోపాటు డీకే పట్టాలు, ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను కూడా కొనుగోలు చేయాలని అంగీకారం కుదిరిందని తెలిపారు.
కొందరి భూములకు పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించగా, మరికొంతమందికి ఎకరానికి రూ1.10 లక్షల చొప్పున అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారన్నారు. ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పామని తెలిపారు. 2011 ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్‌కు రాగా మార్కెట్ ధర ఇవ్వాలని డిమాండ్ చేశామని, అప్పటినుంచి యాజమాన్యం కాలయూపన చేస్తోందని ఆరోపించారు. రెండు నెలల కిందట గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో కంపెనీ యజమాన్యంతో జరిపిన చర్చల సందర్భంగా భూములను సాగు చేసుకోమంటేనే పంటలు వేశామన్నారు. వేసిన పంటలను ఇప్పుడు యంత్రాలతో పీకేయటం దారుణమన్నారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం పూర్తిగా డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునేవరకు భూములు సాగు చేస్తామని స్పష్టం చేశారు.
మా భూముల్లోని పంటలే తొలగించాం..
ఈ విషయమై హిమామి సిమెంట్స్ ప్రతినిధి ఏఎస్సార్ మూర్తి వివరణ కోరగా 800 ఎకరాలకు పూర్తిగా డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్పారు. వీటిలో సుమారు 250 ఎకరాల్లో వేసిన పంటలను మాత్రమే తొలగించామని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేయని భూముల జోలికి పోలేదన్నారు. కొంతమంది వ్యక్తులు కంపెనీకి చెందిన పొలాలను కౌలుకు ఇస్తున్నారని, కంపెనీ ప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ భూములను కాపాడుకునేందుకే పంట లను తొలగించామన్నారు.