ఆ అనుమానాలు నిజమయ్యాయి!: వైఎస్ జగన్
బడ్జెట్ సమావేశాల్లోనే కత్తిరింపుల్ని ఎత్తిచూపిన జగన్
సాక్షి, హైదరాబాద్: నిరుపేదల సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టడానికి ప్రభుత్వం పలు ఎత్తుగడులు వేస్తోందంటూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి పక్ష నేత జగన్మోహన్రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 43,11,688 మం ది వివిధ రకాల పింఛన్లు పొందుతుండగా వీరికి నెలకు రూ.130 కోట్లు చెల్లిస్తున్నారు. అక్టోబర్ నుంచి వృద్ధులు, వికలాంగుల పింఛన్ రూ.వెయ్యికి పెంచిన నేపథ్యంలో ఇప్పటికే పింఛన్ల కోసం పెండింగ్‌లో ఉన్న 15 లక్షల అదనపు దరఖాస్తుల్ని జగన్ ప్రస్తావించారు.
‘‘అక్టోబర్ నుంచి పింఛన్లకు రూ. 431 కోట్లు కావాలి. ఇవికాక 5,36,837 వికలాంగుల పెన్షన్లు రూ.1,500 చొప్పున పెంచితే మరో రూ.10 కోట్లు కావాలి. మొత్తం గా నెలకు రూ.441 కోట్లు చొప్పున వచ్చే ఏడు నెలలకు 3,080 కోట్లు కావాలి. గడిచిన 5 నెలలతో కలిసి మొత్తం రూ. 3,730 కోట్లు కావాల్సి ఉంటే బడ్జెట్లో రూ.1,338 కోట్లు కేటాయించారు. మరి మిగిలిన 2,392 కోట్ల మేరకు కోత పెడతారా? ఆ మేరకు పింఛన్లు ఎగ్గొడతారా?’’ అంటూ అప్పట్లోనే ఆయన ప్రశ్నించారు.
1.4 కోట్ల తెల్లకార్డులకు అమ్మహస్తానికి, అక్టోబర్ నుంచి వచ్చే కొత్త ఫుడ్ పాలసీ అమలుకు రూ.4,671 కోట్లు అవస రం ఉండగా బడ్జెట్లో మాత్రం రూ.2,318 కోట్లు మాత్రమే కేటాయించారు. 2013-14 సంవత్సరానికి స్కాలర్షిప్లు, రీయింబర్స్‌మెంటు కోసం రూ.2,487 కోట్లు అవసరం. గతేడాది బకాయిలు రూ.990 కోట్లు.
హైదరాబాద్‌లో చదివే విద్యార్థులకు మరో 200 కోట్లు కావాలి. మొత్తంగా రూ. 3,700 కోట్లు అవసరం ఉండగా బడ్జె ట్లో రూ.2,100 కోట్లే కేటాయించారు. కోతలకు సర్కారు సిద్ధమైందని జగన్ విమర్శించారు. పథకాలన్నిటినీ ఆధార్‌కు లింక్ చేస్తున్నామనే పేరుతో కోతలకు దిగుతుండటంతో ప్రతిపక్ష నేత అనుమానాలన్నీ నిజమవుతున్నాయనేది రాజకీయ వర్గాల మాట.