తిరుగుటపాలో దరఖాస్తు పత్రాలు
కంగుతిన్న పోస్టుమెన్ ఉద్యోగార్థులు
హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం తపాలాశాఖ పోస్టుమెన్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో చాలామంది నిరుద్యోగ యువకులు సంబరపడి దరఖాస్తులు పంపారు. కానీ కేవలం తపాలాశాఖ వెబ్సైట్లో పొందుపర్చిన దరఖాస్తు కాలంను పూరించి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలని అధికారులు నోటిఫికేషన్లో పేర్కొన్నా.. ఇలా దరఖాస్తులు అందటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వాటన్నింటిని తిరుగుటపాలో అభ్యర్థులకు పంపటంతో అభ్యర్థులు కంగుతిన్నారు. అభ్యర్థుల అవగాహనలేమిని అవకాశంగా చేసుకుని దళారులు దరఖాస్తు పత్రాలు రూ.50 నుంచి రూ.200 చొప్పున అమ్మారు.
18తో గడువు సమాప్తం: 379 పోస్టుమెన్, 31 మెయిల్ గార్డ్స్ పోస్టుల కోసం తపాలాశాఖ గతనెల 17న నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు గడువు ఈనెల 18తో ముగియనుంది. ఇప్పుడు మ్యాన్యువల్ దరఖాస్తులు తిరుగుటపాలో రావటంతో అభ్యర్థులు హడావుడిగా ఆన్లైన్లో మళ్లీ దరఖాస్తు చేసే పనిలో పడ్డారు. కేవలం ఆన్లైన్లో అందే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామని, అభ్యర్థుల www.appost.in వెబ్సైట్ నుంచి దరఖాస్తులు నింపి పంపాలని తపాలాశాఖ ఏపీ సర్కిల్ రిక్రూట్మెంట్ విభాగం అసిస్టెంట్ డైరక్టర్ శనివారం తెలిపారు.