బోనాల తూప్రాన్
ఉజ్జయిని మహంకాళి పండగ కోసం భారీగా ఏర్పాటు
∙పోతరాజులకు, బ్యాండు మేళాలకు పెరిగిన డిమాండ్
∙పెరిగిన ఖర్చులతో ఇబ్బంది పడుతున్న కమిటీలు
తూప్రాన్ : గ్రామీణ ప్రాంతాల్లో బోనాల ఉత్సవాల తీరే వేరు. సంబరాలు అంబరాన్ని అంటేలా కార్యక్రమాలు జరుగుతాయి. చిన్నా,పెద్దా, ఆడామగ అంతా వేడుకల్లో పాలుపంచుకుంటారు. ఈక్రమంలో అమ్మవారికి సమర్పించే తొట్టెల కార్యక్రమాన్ని ధూంధాంగా నిర్వహించేందుకు కొన్ని నెలలుగా యువకులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
పోతరాజులు, బ్యాండు, న్యత్యకారులు, దేవాతమూర్తుల విగ్రహాల ప్రదర్శనకు అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి ప్రస్తుతం పల్లెలకూ పాకింది. అ యితే, ఏటా ఖర్చులు పెరుగుతున్నాయని యు వకులు వాపోతున్నారు. అయినా, కార్యక్రమా లు అదిరిపోయేలా చేస్తామని చెబుతున్నారు.
పట్టణంలో డీజేలకు క్రేజ్
జిల్లావ్యాప్తంగా ఏటా తూప్రాన్ మండల కేంద్రంలో బోనాలు మూడు రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఆరేళ్ల క్రితం డీజే సౌండ్ సిస్టంతో మహిళ డ్యాన్సుర్లు ఆడేవారు. దీనిపై పోలీసులు అభ్యంతరం తెలపడంతో బ్యాండు మేళాలలకు క్రేజ్ పెరిగింది. స్టార్‌వార్స్ యూత్, ఛత్రపతి యువసేన, జయరాం యూత్, భజరంగ్బళి యువసేన, సాయి యూత్, కాణిపాక యూత్ తదితర యూత్ సభ్యులు ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
గతంలో పట్టణంలో దాదాపు 15 తొట్టెల కార్యక్రమాలు జరగగా.. ఈసారి మరో ఏడు పెరగవచ్చని యువకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, బోనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఇక్కడ మరిన్ని కార్యక్రమాలు జరుగుతాయని వారు చెబుతున్నారు.
సికింద్రాబాద్‌తో పాటు తూప్రాన్‌లో...
హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు ముగిసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం అనవాయితీ. కానీ, ఈ ఏడు సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల రోజునే తూప్రాన్‌లో అంటే ఈనెల 31న నిర్వహించేందుకు గ్రామస్తులు నిర్ణయించారు.
దీంతో ఘనంగా తొట్టెల కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్న యువకులు ఆందోళన చెందుతున్నారు. ఒకే రోజున సికింద్రాబాద్, తూప్రాన్‌లో నిర్వహిస్తుండంతో బ్యాండు మేళాలు, నృత్యాకారులకు డిమాండ్ ఏర్పడింది. గతంలో కంటే రెండింతలు ఎక్కవగా డిమాండ్ చేస్తున్నారని వారు తెలిపారు.
ఖర్చులు ఇలా...
బోనాల ఉత్సవాల కోసం యువకులు కమిటీగా ఏర్పడి రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. బ్యాండు కోసం రూ.40 వేల నుంచి రూ.60 వేలు, పోతరాజులు, శివసత్తుల కోసం ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు, నృత్యకారులు ఒక్కొక్కరికీ రూ.1,500, దేవాతామూర్తుల విగ్రహల ప్రదర్శన కోసం విగ్రహనికి డిమాండ్‌ను బట్టి రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు చెల్లిస్తున్నారు.
ఎక్కువ ధరలు
బోనాల సందర్భంగా మార్కెట్లో బ్యాండుమేళాలు, పోతరాజులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో వారు ధరలు ఒక్కసారిగా పెంచేశారు. అమ్మవారికి ఘనంగా తొట్టేల సమర్పించాలకున్నా.. పెరిగిన ధరలు ఇబ్బందిగా ఉన్నాయి. – సాయిప్రకాశ్, ఛత్రపతి యువసేన
ఇబ్బంది పడుతున్నాం
పోతరాజులు, బ్యాండు మేళాలు మార్కెట్లో దొరకడంలేదు. హైదరాబాద్‌లో పండగ ఉండటంతో వారికి డిమాండ్ ఏర్పాడింది. డబ్బులు ఎంత ఖర్చు చేద్దామనుకున్న ఫలితం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. – తరుణ్, స్టార్‌వార్స్ యూత్ అసోసియేషన్
ఘనంగా నిర్వహిస్తాం
ప్రతి సంవత్సరం బోనాల రోజున అమ్మవారికి తొట్టెలు నిర్వహిస్తున్నాం. ఈసారి ఘనంగా నిర్వహించేందుకు అందరికీ అడ్వాన్సులు ఇచ్చేశాం. ఈసారి రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అయినా, కార్యక్రమాలు ఘనంగా చేస్తాం. – శివసాయి, భజరంగ్‌దల్ యూవసేన