అమ్మాయి కావాలా? లేక అబ్బాయా?
చైనాలోని ఓ గ్రామంలో మేధావులకు సైతం అంతుచిక్కని విషయం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ మధ్యే సడలించిన సింగిల్ చైల్డ్ పాలసీతో గత మూడు దశాబ్దాలుగా చైనా జనాభా నియంత్రణను పాటించిన విషయం తెలిసిందే. చైనాలోని మైనారిటీ తెగల వారికి సింగిల్ చైల్డ్ పాలసీ వర్తించదు. దక్షిణ చైనాలోని జాన్లీ అనే గ్రామంలోని ప్రజలు మాత్రం ఆరు వందల సంవత్సరాల నుండి ఫ్యామిలీ ప్లానింగ్ పాటించడంలో ముందున్నారు. ఆ గ్రామ జనాభాలో సగం మంది మహిళలు ఉండగా మిగిలిన సగం పురుషులు ఉన్నారు. జాన్లీ గ్రామంలో స్త్రీ, పురుష జనాభా నిష్పత్తి మారకుండా ఎప్పుడూ ఒకేలా ఉండటం విశేషం.
జాన్లీ గ్రామంలోని ప్రతీ కుటుంబంలో ఒక మగ, ఒక ఆడ శిశువు ఉండేలా ముందే జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే అదేదో స్కానింగ్లు గట్రా చేసి ముందుగానే లింగ నిర్ధారణ చేస్తారేమోననే అనుమానం కలగొచ్చు కానీ అలా జరగదు. అక్కడ వారసత్వంగా వస్తున్నటువంటి చెట్ల రసాలతో తయారైన ఓ పానియం ద్వారా ఇది సాధ్యమవుతున్నట్లు తెలుస్తోంది. దంపతులకు ముందుగా మగ శిశువు పుట్టినట్లయితే తరువాత వారికి ఆడబిడ్డ జన్మించేలా పానియం ఇస్తారు. అలాగే ముందుగా ఆడబిడ్డ జన్మించిన వారికి తరువాత ప్రసవంలో మగశిశువు జన్మించేలా పానియం ఇస్తారు. ఈ తెగలో మరొక ఆచారం ఏమిటంటే కేవలం ఊరిలో వారి మధ్యే వివాహాలు జరిపిస్తారు. బయటి ఊరి సంబంధాలు చేసుకోరు.
ఈ విధంగా శతాబ్దాల పాటు స్త్రీ, పురుష నిష్పత్తిని సమానంగా పాటించేలా చేస్తున్న వారి పానియం దేనితో తయారవుతుందో అని ఆసక్తిపరులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ గ్రామంలో వారసత్వంగా వస్తున్నటువంటి రెండు బావుల ద్వారా సేకరించిన జలాలతో ఈ పానియాన్ని తయారు చేస్తున్నట్లు తెలిసింది. మగ బిడ్డకోసం ఒక బావిలోని నీటితో తయారు చేసిన ద్రావణం, ఆడబిడ్డ కోసం మరొక బావిలోని నీటితో చేసిన ద్రావణం వాడుతున్నారు. అయితే ఇదే మందు గర్భనిరోధానికి, గర్భం దాల్చడానికి కూడా దానిని వాడే విధానాన్ని బట్టి పనిచేస్తుండటం గమనార్హం.
జాన్లీలో ఉన్నటువంటి 98 శాతం కుటుంబాలలో ఒక మగ, ఒక ఆడ సంతానం ఉండటంపై చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ శాస్త్రవేత్త జింగ్లియాంగ్ మాట్లాడుతూ ఇక్కడి తెగకు సంబంధించిన మానవజాతి మూలాలతో పాటు, అత్యాధునికి వైద్య పరిశోధనల ద్వారా ఈ రహస్యాన్ని వెల్లడి చేయాల్సి ఉందన్నారు.