ప్రజాసంక్షేమం పట్టని సీఎం
భీమవరం : దోచుకో.. దాచుకో అనే సూత్రానికి తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజాసంక్షేమం పట్టడం లేదని, ఎవరి మాటలూ తలకెక్కవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా సోమవారం భీమవరంలో ప్రారంభమైన ప్రజాభేరి పాదయాత్రనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఫుడ్‌పార్క్ కారణంగా భీమవరం, నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం మండలాల్లోని సుమారు 40 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. రైతులు, మత్స్యకారులు ఉపాధిని దెబ్బతీసే ఫుడ్‌పార్క్‌ను జనావాసాల నుంచి సముద్రతీరప్రాంతానికి తరలించాలని రెండున్నరేళ్లుగా ఆందోళన చేస్తున్న సీఎంకు పట్టడం లేదన్నారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఏవైనా సూచనలు చేస్తే అభివృద్ధి నిరోధకుడని ముద్ర వేస్తున్నారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పినా ముఖ్యమంత్రి పెడచెవినపెట్టారని దుయ్యబట్టారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కును మరోచోటకు తరలించాలని తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలు రెండున్నరేళ్లుగా ఉద్యమిస్తుంటే ఆయా గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టి పోలీసులను మోహరింప చేసి ప్రజలను జైల్లో పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు ధనవంతుల కోసం 40 గ్రామాల ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని అడ్డుకుంటామన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరి కోసం మాట మార్చారో చెప్పాలని నిలదీశారు. ఇక్కడి ప్రజలది న్యాయసమ్మతమైన కోరిక కాబట్టే ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి స్వయంగా ఇక్కడ పర్యటించి ఉద్యమానికి అండగా ఉంటామని మాట ఇచ్చిన విషయం గుర్తించాలన్నారు. అనంతరం ప్రజాభేరి పాదయాత్ర ప్రకాశం చౌక్ నుంచి రెస్ట్‌హౌస్ రోడ్డు, బ్యాంక్ కాలని, గునుపూడి మీదుగా తాడేరు, కరుకువాడ చేరుకుంది. సీపీఎం నాయకులు బి.బలరామ్, జేఎన్వీ గోపాలన్, జుత్తిగ నర్సింహమూర్తి, వైఎస్సార్ సీపీ నాయకుడు భూసారపు సాయి సత్యనారాయణ, సీపీఐ నాయకుడు ఎం.సీతారాం ప్రసాద్, తుందుర్రు ఎంపీటీసీ జవ్వాది వెంకట రమణ పాల్గొన్నారు.