బాధితులకు అండగా ఉంటాం
ప్రతి ఒక్కరికి పరిహారమందే వరకు పోరాటం
తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రకాష్‌కారత్ పర్యటన
స్టీల్‌ప్లాంట్, కంచరపాలెంలలో మొక్కలు నాటిన కారత్
సాక్షి, విశాఖపట్నం: హుదూద్ తుపాను బాధితులకు సీపీఎం అండగా ఉంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కారత్ భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి పరిహారం అందేవరకు బాధితుల తరపున సీపీఎం పోరాడుతుందన్నారు. జిల్లా, రాష్ర్ట స్థాయిల్లో తమ పార్టీ నేతలు బాధితుల తరపున పోరాడతారని చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ సాయం కోసం కేంద్రంపై తాము ఒత్తిడి తీసుకొస్తామన్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం పార్టీ రాష్ర్ట, జిల్లా నాయకులతో కలిసి కారత్ పర్యటించారు. తొలుత హుదూద్‌కు తీవ్రంగా దెబ్బతిన్న స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. ప్లాంట్‌కు జరిగిన నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు, కార్మికులతో జరిగిన నష్టంపై ఆరా తీశారు. అనంతరం ప్లాంట్ సాంకేతిక శిక్షణా కార్యాలయం ప్రాంగణంలో పార్టీ రాష్ర్ట కార్యదర్శి పి.మధు, జిల్లా కార్యదర్శి నరసింగరావు, ఉద్యోగ, కార్మిక సంఘ నాయకులతో కలిసి మొక్కలు నాటారు.
అనంతరం వారినుద్దేశించి మాట్లాడుతూ ప్లాంట్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా తాము పోరడతామని హామీ ఇచ్చారు. అక్కడ నుంచి కంచరపాలెం చేరుకున్న కారత్కు పార్టీ గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి బి.గంగారావు ఆధ్వర్యంలో పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం పైకప్పులు లేచిపోయి..దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన కారత్ బాధితులతో మాట్లాడారు.
సర్వస్వం కోల్పోయిన తమను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు టీడీపీ నాయకులు చెప్పిన వారి పేర్లనే జాబితాల్లో రాస్తున్నారని ఆయనకు వారు చెప్పారు. అక్కడ నుంచి కంచరపాలెం హైవేపై ఉన్న పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నేతలతో కలిసి మొక్కలు నాటారు. పార్టీ కార్య కర్తలు, బాధితులనుద్దేశించి మాట్లాడుతూ హుదూద్ తుపాను కనివినీ ఎరుగని నష్టాన్ని మిగిల్చిందని..లక్షలాదిమంది ప్రజలను ఇబ్బందుల పాల్జేసిన ఈ విపత్తును జాతీయవిపత్తుగా ప్రకటించి విశాఖ పునర్నిర్మాణానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని సూచించారు.
అధికారులు పక్షపాత ధోరణిని విడనాడి దెబ్బతిన్న ప్రతి ఒక్క బాధితుడికి పరిహారం అందించేందుకు కృషి చేయాలన్నారు. లేకుంటే బాధితుల తరపున సీపీఎం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. పార్టీ జిల్లా నాయకులు కె.లోకనాథం, ఎన్.రామారావు, జే.అయోధ్యరామ్, ఆర్.భాగ్యలక్ష్మి, బొట్టు ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.
కారత్కు వినతుల వెల్లువ
విశాఖ పర్యటనకు వచ్చేసిన కారత్కు వివిధ వర్గాలకు చెందిన వారు పెద్దఎత్తున వినతులు సమర్పించారు. తొలుత స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.రామారావు, డి.ఆదినారాయణలు స్టీల్ ప్లాంట్ పునర్నిర్మాణానికి కేంద్రం ఆదుకునేలా ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ప్లాంట్‌కు రెండేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని, రైల్వేశాఖ 1000 రేక్స్‌ను ప్రత్యేకంగా కేటాయించాలని, నష్టానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేసేందుకు హైలెవల్ కమిటీని పంపించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని వారు కారత్ను కోరారు. హుదూద్ వల్ల హిందూస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్‌కు రూ.500 కోట్ల మేర నష్టంవాటిల్లిందని, నౌక నిర్మాణ ఆర్డర్స్ అన్ని హెచ్ఎస్ఎల్కే ఇప్పించేలా కృషి చేయాలని కోరుతూ హెచ్ఎస్ఎల్ స్టాఫ్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.వి.రమణమూర్తి, వి.నాగేశ్వరరావులు కారత్కు వినతిపత్రం సమర్పించారు.