పిల్లల్ని బావిలో తోసేసిన తల్లి
కుందుర్పి (అనంతపురం): తన కుమార్తెను కాన్వెంట్లో చదివించడం లేదన్న ఆవేదనతో ఓ తల్లి హృదయం కఠినంగా మారింది. ఇద్దరు కుమార్తెలను బావిలో తోసేసింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. హృదయాన్ని కదలించే ఈ ఘటన అనంతపురం జిల్లా కుందుర్పి మండలం పరిధిలో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కరిగానిపల్లి గ్రామానికి చెందిన ఆనంద్, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె గౌతమి (5) ని సమీపంలోని ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నారు. ప్రమీల భర్త ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. కుటుంబ పోషణ ఆనంద్ సోదరుడే చూసుకుంటున్నాడు.
అయితే, ఆనంద్ సోదరుడు తన పిల్లలను కాన్వెంట్లో చదివిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన కుమార్తె గౌతమిని కూడా కాన్వెంట్లో చదివించాలని ప్రమీల కోరింది. అందుకు వారు తిరస్కరించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రమీల తనకు పిల్లలే అక్కర్లేదని భావించింది. ఎనుములదొడ్డిలోని పుట్టింటికి వెళుతున్నానని చెప్పి ఇద్దరు పిల్లల్ని తీసుకుని బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చింది. కరిగానిపల్లి, ఎనుముల దొడ్డి మధ్యలో ఓ గుట్టపైనున్న బావిలో ఇద్దరు పిల్లల్ని తోసేసింది. పశువుల కాపర్లు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసే చర్యలు చేపట్టారు.