పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం
- జిల్లా కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తామని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో స్థాపించిన పరిశ్రమలకు సంబంధించి విద్యుత్ రాయితీ, పావలా వడ్డీ, సేల్స్ ట్యాక్స్ రాయితీ, స్టాంప్ డ్యూటీ, పెట్టుబడి రాయితీకి సంబంధించి మొత్తం రూ. 12 కోట్ల మంజూరుకు అనుమతి ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన, ఇతర అంశాలపై జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సోమశేఖరరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. వీలైనంత మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింగిల్ డెస్క్ విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు అనంద్నాయక్, మదన్మోహన్శెట్టి, శ్రీదేవి, ఆంధ్రప్రదేశ్ చిన్న పరిశ్రమల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జీపీఆర్రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయకుమార్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్ఈ భార్గవరాముడు పాల్గొన్నారు.