‘అన్నపూర్ణ కృషి ప్రసార సేవ’పై అవగాహన
కొత్తపల్లి : రైతులకు సాంకేతిక సమాచారాన్ని అందజేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అన్నపూర్ణ కృషి ప్రసార సేవ పేరిట టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్టు వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె.కృష్ణప్రసాద్ అన్నారు. జిల్లాలో తొలిసారి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అన్నపూర్ణ కృషి ప్రసార సేవ టోల్ ఫ్రీ నంబర్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నేరుగా శాస్త్రవేత్తలను సంప్రదించవచ్చన్నారు. వ్యవసాయం, పాడిపరిశ్రమ, ఉద్యాన వన పంటలు, చేపల పెంపకం తదితర అంశాలపై సూచనలు, సలహాలు పొందవచ్చునన్నారు. 24 గంటలూ ఈ టోల్ ఫ్రీ నంబర్ 18004253141 రైతులకు అందుబాటులో ఉంటుందన్నారు. రైతులు సెల్‌ఫోన్ నంబర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాతే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందుతుందన్నారు. ఇప్పటివరకూ సుమారుగా 22 వేల నంబర్లు రిజిస్ట్రేషన్ అయినట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాకినాడ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ పీఎల్ఆర్జే ప్రవీణ, శాస్త్రవేత్త ఎం.నందకిషోర్, గుంటూరు జిల్లా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వీడియో ల్యాబ్ రీసెర్చి పర్సన్స్ డాక్టర్ ఎం.సహదేవయ్య, డాక్టర్ పి.సాయి, కాకినాడ ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ పి.పద్మజ, పిఠాపురం ఏడీఏ పద్మశ్రీ, ఏఓ జోగిరాజు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు అనిశెట్టి సత్యానందరెడ్డి, ఎంపీడీఓ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.