ఉత్సాహంగా అనంత ప్రీమియర్ లీగ్ పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లాలోని వివిధ క్రీడా మైదానాల్లో ఆదివారం నిర్వహించిన అనంత ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఆర్డీటీ, జిల్లా క్రికెట్ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న అనంత ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల్లో అనంతపురం, కదిరి, ధర్మవరం, పెనుకొండ, గుంతకల్లు జట్లు విజయం సాధించాయి.
నీలంసంజీవరెడ్డి క్రీడా మైదానంలో అనంతపురం, బీకేఎస్ జట్లు తలపడగా మొదట బ్యాటింగ్ చేసిన అనంత జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. యోగానంద (96), షరీఫ్ (51) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బీకేఎస్ జట్టు 41.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలి ఓడింది.
పెనుకొండ వేదికగా మడకశిర జట్టుతో మ్యాచ్‌తో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పెనుకొండ జట్టు నిర్ణీత ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది. జట్టులో షాషావలి (133) సెంచరీతో రాణించాడు. అనంతరం మడకశిర జట్టు 25.4 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. పెనుకొండ బౌలర్ ఖాదర్‌వలి 5 వికెట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ధర్మవరంలో జరిగిన మ్యాచ్‌లో గాండ్లపెంట, ధర్మవరం జట్లు తలపడగా.. మొదట బ్యాటింగ్ చేసిన గాండ్లపెంట జట్టు 23 ఓవర్లలోనే 71 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ధర్మవరం జట్టు 32.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
కదిరిలో జరిగిన మ్యాచ్‌లో కదిరి, యల్లనూరు జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కదిరి జట్టు 45 ఓవర్లలో 187 పరుగులు చేసి ఆలౌటైంది. జట్టులో ఓంసాయి ప్రకాష్ (53) అర్ధశతకం చేశాడు. అనంతరం యల్లనూరు జట్టు 171 పరుగులకే కుప్పకూలింది. జట్టులో వంశీ (50) మినహా ఎవరూ రాణించలేదు.
గుంతకల్లులో గుంతకల్లు, పుట్లూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుంతకల్లు జట్టు 49 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. జట్టులో నిసార్ (90), హాసిం (51) రాణించారు. పుట్లూరు బౌలర్లు శంకర్ 4, నవీన్ 2 వికెట్లు తీశారు. అనంతరం పుట్లూరు జట్టు 28 ఓవర్లలో 93 పరుగులు చేసి ఘోరంగా ఓడింది. అనంత ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు వచ్చే వారం కూడా జరుగుతాయని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు.