ఎంపీ అసభ్యకరంగా ప్రవర్తించారు: నటి శ్వేతా మీనన్
కొల్లాం లోక్సభ సభ్యుడు పితాంబరం కురుప్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మలయాళ సినీ నటి శ్వేతా మీనన్ శనివారం కొచ్చిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆరోపించారు. కొల్లాంలో నిన్న సాయంత్రం పడవల పోటీ విజేతలకు ప్రెసిడెంట్స్ ట్రోఫీ బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన తన పట్ల ప్రవర్తించిన తీరుకు సంబంధించిన మీడియా పూటేజ్లను ఆమె ప్రదర్శించారు. ఆయనపై చర్యల కోసం మలయాళ చిత్ర పరిశ్రమను సంప్రదిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
శ్వేత మీనన్ ఆరోపణలతో మలయాళీ చిత్ర పరిశ్రమ అగ్ని మీద గుగ్గిలమైంది. పితాంబరంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అటు మలయాళీ చిత్ర పరిశ్రమ ఇటు మహిళ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే శ్వేత మీనన్ ఆరోపణలను లోక్సభ సభ్యుడు పితాంబరం (73) తీవ్రంగా ఖండించారు. ఓ మీడియా వర్గం కావాలనే తనపై ఇలా విష ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు.
ఆ సంఘటన అనుకోకుండా జరిగిందని తెలిపారు. ఆ విషయంలో తాను అమాయకుడినని చెప్పారు. తన నిర్దోషత్వాన్ని తర్వలో నిరూపించుకుంటానని వెల్లడించారు. శ్వేత మీనన్ ఆరోపణలను సు మోటోగా స్వీకరించి, విచారణ చేపడుతున్నట్లు కేరళా మహిళ హక్కుల సంఘం అధ్యక్షురాలు లిసీ జోస్ వెల్లడించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.