ప్రమాదానికి బాధ్యతగా ప్రధాని రాజీనామా
బుకారెస్ట్(రుమేనియా): దేశ చరిత్రలో ఎన్నడూలేనంతటి ఘోర అగ్నిప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రుమేనియా దేశ ప్రధాని విక్టర్ పొంటా(43) బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. గత నెల ఆరో తేదీన బుకారెస్ట్‌లోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 32 మంది సజీవదహనమయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాదాపు వంద మంది క్షతగాత్రుల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంది. దాంతో ఆగ్రహించిన 20,000 మంది స్థానికులు సోమవారం సిటీలోని ప్రఖ్యాత విక్టరీ స్క్వేర్ వద్ద ఆందోళనకు దిగారు.
ప్రధాని గద్దెదిగాలని నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు పొంటా ప్రకటించారు. తన రాజీనామా, వీధుల్లోకి వచ్చిన ప్రజలను సంతృప్తి పరుస్తుందని భావిస్తున్నానన్నారు. రుమేనియాకు పోంటా 2012 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు.