ప్రభుత్వ హామీలపై జాక్టో నేతల ధ్వజం
అనంతపురం ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుత్తి హామీలను గుప్పిస్తూ కాలం గడుపుతోందే తప్ప, చర్యలు తీసుకోవడం లేదని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) నాయకులు ధ్వజమెత్తారు. టీచర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చేస్తున్న తాత్సారాన్ని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా జాక్టో ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ఒక్కరోజు దీక్ష చేశారు. జాక్టో నాయకులు బీటీఏ ఓబులేసు, ఎస్‌ఎల్‌వీటీ వై. ఆదిశేషయ్య, ఎస్టీఎఫ్ వెంకటరమణప్ప, ఆర్జేయూపీ రామానాయుడు, ఆపస్ భాస్కరయ్య, టీఎన్‌యూఎస్ నారాయణస్వామి, పీఆర్టీయూ పుల్లప్ప, బీసీటీయూ నారాయణస్వామి దీక్షలో కూర్చున్నారు.
వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసిందన్నారు. విద్యా, ఉపాధ్యాయ రంగ సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందన్నారు. ఎంఈఓ, డెప్యూటీ డీఈఓ, జూనియర్ అధ్యాపకులు, డైట్ అధ్యాపకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అప్రెంటీస్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేశారన్నారు. ఎన్టీఆర్ హయాంలో రూ. 398 వేతనంతో పని చేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదన్నారు. గతేడాది ముఖ్యమంత్రి సంతకం పూర్తయి, ఆడిగన ఉన్నత పాఠశాలల్లోని భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంటు పోస్టులుగా అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు.
మునిసిపల్, పంచాయతీ, ఎయిడెడ్ యాజమాన్యాల్లో ఉద్యోగ విరమణ పొందిన టీచర్లకు అర్ధవేతన సెలవును నగదుగా మార్చుకునే సౌకర్యం పునరుద్ధరించాలన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచుతూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. 10వ వేతన సవరణ కమిటీ సిఫార్సులను పరిశీలించి 63 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేయాలన్నారు. పాఠశాలల పనివేళలను సమీక్షించి, పాత పనివేళలను పునరుద్ధరించాలన్నారు.
2013లో బదిలీ అయిన ఉపాధ్యాయులును వెంటనే రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాస్థాయి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు నిర్ణీత కాలవ్యవధిలో నిర్వహించాలన్నా రు. జాక్టో జిల్లా కన్వీనరు రామకృష్ణారె డ్డి, నాయకులు శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాసులు, రామలింగయ్య, నాగభూషణ, లక్ష్మీనారాయణ, మల్లికార్జునరెడ్డి, ఆదిశేషు, హొ న్నూరప్ప తదితరులు పాల్గొన్నారు.