ప్రభుత్వాధీనంలోకి ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు
ఉన్నత విద్యా మండలి విజ్ఞప్తి
ప్రభుత్వ కాలేజీల అభివృద్ధికి చర్యలు
రూసా అమలుపై సమీక్షలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలను ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. తద్వారా మంచి పేరున్న కాలేజీలను కాపాడుకుని అభివృద్ధి చేసుకోవచ్చునన్నారు. రాష్ట్రంలో రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(రూసా) అమలుపై కేంద్ర ప్రభుత్వ కన్సల్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్ కుమార్ గురువారం హైదరాబాద్ కు వచ్చారు. రాష్ట్రంలో రూసా అమలుకు సంబంధించిన వివిధ అంశాలపై ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరులతో పాపిరెడ్డి మాట్లాడారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన, న్యాక్ అక్రెడిటేషన్ పొందేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. రూసా అమలు కోసం రాష్ట్రానికి రూ. 138 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. రూసా మార్గదర్శకాల ప్రకారం చర్యలు చేపట్టినకొద్దీ రాష్ట్రానికి విడతలవారీగా నిధులు వస్తాయన్నారు. ఫ్యాకల్టీ నియామకాలపై దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
రూసాలో మంజూరైనవి..
ఉస్మానియా, జేఎన్టీయూలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 10 కోట్ల చొప్పున నిధులు. తర్వాత మరో రూ. 10 కోట్లు. డాక్యుమెంట్స్ సరిగా లేనందున కాకతీయ వర్సిటీకి మళ్లీ ప్రతిపాదనలు పంపనున్నారు.
ఆదిలాబాద్ మోడల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు షరతులతో ఆమోదం. ఈ ఏడాది రూ. 6 కోట్ల నిధులు. మొత్తంగా రూ. 12 కోట్ల కేటాయింపు.
కరీంనగర్, వరంగల్, హుస్సేనీఆలం డిగ్రీ కాలేజీలను మోడల్ డిగ్రీ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసేందుకు ఒక్కో దానికి రూ. 4 కోట్ల నిధులు. పది జిల్లాల్లోని 33 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 2 కోట్ల చొప్పున నిధులు.