నిరంతరం అప్రమత్తం
అనంతపురం సెంట్రల్ : ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఎన్కౌంటర్ నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని క్విక్ రెస్పాన్స్ టీం, అంగరక్షకులను ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదేశించారు. బుధవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో వీరికి ఎస్ఐబీ, గ్రేహాండ్స్ విభాగాల్లో అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీని సమూలంగా తుడిచిపెట్టిన ఘనత రాష్ట్ర పోలీసులకు దక్కుతుందన్నారు. ఇటీవల ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనాయకులు మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అందాయన్నారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు పటిష్ట భద్రత కల్పించి వారికి రక్షణ కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీటీసీ డీఎస్పీ ఖాసీంసాబ్, ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, స్పెషల్‌బ్రాంచ్ సీఐలు రాజశేఖర్, యల్లంరాజు తదితరులు పాల్గొన్నారు.
నిఘా కట్టుదిట్టం
అంతకుముందు ఎస్పీ రాజశేఖరబాబు మడకశిర, హిందూపురం సర్కిల్ స్టేషన్లను తనిఖీ చేశారు. అనంతరం ఆయాచోట్ల విలేకరులతో మాట్లాడారు. నేరాల నివారణకు నిఘాను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 1000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నామన్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో పలు చోట్ల మట్కా ఇతర అసాంఘిక కార్యకలాపాలను నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోని 600 పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.