ఇదేమి చోద్యమో..!
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: డిగ్రీ కళాశాలలో సైకాలజీ సబ్జెక్టును బోధించేందుకు అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థినులు జూనియర్ కళాశాలకు వెళ్లి పాఠ్యాంశాలు నేర్చుకుంటున్న వైనమిది. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలోని కళాశాలలో జరిగిందనుకుంటే పొరపాటే. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నెలకొన్న దుస్థితికి నిదర్శనమిది. సాధారణ సబ్జెక్టులతోపాటు విద్యార్థులను మానసికంగా తీర్చిదిద్ది ఇతర సబ్జెక్టుల్లో ప్రతిభావంతులుగా నిలపడంలో సైకాలజీ ఉపయోగపడుతోంది. ఎంతో ప్రాముఖ్యం కలిగిన కోర్సును బోధించేందుకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏడాదిన్నరగా అధ్యాపకులే లేకపోవడంతో విద్యార్థుల భవిత ప్రశ్నార్ధకంగా మారింది. ఇక్కడ డిగ్రీ స్థాయిలో ఎకనామిక్స్, పాలిటిక్స్, సైకాలజీ సబ్జెక్టుల కలయికతో ఒక కోర్సు నిర్వహిస్తున్నారు.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల పరిధిలో సైకాలజీ సబ్జెక్టు ఒక్క గుంటూరులోనే ఉంది. గతంలో ఇక్కడ సైకాలజీ శాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేసిన డాక్టర్ టీడీ విమల 2012 సెప్టెంబర్‌లో ప్రిన్సిపాల్‌గా ఉద్యోగోన్నతిపై కొత్తగూడేనికి వెళ్లారు. అప్పటినుంచి ఈ పోస్టులో ప్రభుత్వం కొత్తగా ఎవరినీ నియమించలేదు. దీంతో కళాశాలలో విద్యార్థినులకు సైకాలజీలో తరగతులు జరగడం లేదు. రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో ఇతర కళాశాలలకు చెందిన అధాపకులకు గెస్ట్ లెక్చర్ ఇప్పిస్తున్నారు. 2013-14 విద్యాసంవత్సరంలో ఈ కోర్సులో ప్రవేశాలను సైతం నిలిపివేశారు. ప్రస్తుతం ద్వితీయ, తృతీయ సంవత్సరాలు చదువుతున్న వారికి సైకాలజీలో బోధన సాగడం లేదు. మరో విషయం ఏమింటే డిగ్రీ కళాశాల విద్యార్థినులు కళాశాల ప్రాంగణంలోని ప్రభుత్వ వృత్తివిద్యా జూనియర్ కళాశాలలో సైకాలజీ తరగతులకు హాజరవుతున్నారు. నాక్ ‘ఏ’గ్రేడ్ సాధించిన కళాశాలలోనే అధ్యాపకులు లేకపోవడం గమనార్హం.
తరగతులు నష్టపోతున్నాం..
డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా విమల మేడం సైకాలజీ సబ్జెక్టు రెగ్యులర్‌గా బోధించే వారు. మేడం వెళ్లిన తరువాత రెండేళ్ళుగా సక్రమంగా తరగతులు జరగడం లేదు. సబ్జెక్టులో వెనుకబడతామని జూనియర్ కళాశాలకు వెళ్లి పాఠాలు నేర్చుకుంటున్నాం. అప్పుడప్పుడు వేరే కళాశాలల నుంచి అధ్యాపకులు వచ్చి పాఠాలు చెప్పి వెళుతున్నారు. త్వరలో ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
- ఎండీ ఫర్జానా, తృతీయ సంవత్సర విద్యార్థిని