ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ప్రజాగ్రహం తప్పదు
అనంతపురం టౌన్ : విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, ఇతర హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, బడ్జెట్లో జిల్లాకు అన్యాయం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జగదీష్, ఇతర నాయకుల అరెస్టును నిరసిస్తూ ఆదివారం విపక్షాల ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఆందోళన చేసిన సీపీఐ నేతలను అరెస్టు చేసి జైలులో పెట్టడం దారుణమన్నారు. ఇది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. విభజన బిల్లుపై చర్చ సమయంలో ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని ప్రతిపక్షంలో ఉండి వెంకయ్యనాయుడు కోరానన్నారు. అధికారంలోకి రాగానే మాటమార్చారని మండిపడ్డారు.పోలవరం ప్రాజెక్టుకుకేవలం రూ.100 కోట్లు కేటాయించడం తెలుగు ప్రజలను అవమానించడమేనన్నారు.
రాష్ట్ర బడ్జెట్లో వెనుబడిన రాయలసీమ అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై చంద్రబాబునాయుడు ఒత్తిడి తేవడం మానేసి విదేశీ పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ధనుంజయ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్న సీపీఐ నేతల అరెస్టు అన్యాయమని శాసనసభలో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వాకౌట్ చేశారన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్పపాడు హుసేన్ పీరా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరశురాం, రాష్ట్ర కార్యదర్శి నరేంద్రరెడ్డి, నగర కమిటీ యవజన అధ్యక్షుడు మారుతీనాయుడు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దాదాగాంధీ, సీపీఐ నేతలు పాల్గొన్నారు.
కేసులు పెట్టి ఉద్యామన్ని అణచలేరు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం ఉధృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేసులు పెట్టి ఉద్యమాన్ని అణచలేరని స్పష్టం చేశారు. సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన చంద్రబాబునాయుడు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. రాజధాని పేరుతో ప్రభుత్వం వ్యాపారం చేయడంపై చూపించే శ్రద్ధ రాష్ట్ర సంక్షేమంపై చూపడం లేదని ధ్వజమెత్తారు.