ఇసుక పాలసీ అమలు కఠినతరం
పీయూసీ భేటీలో కమిటీ ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ అమలును కఠినతరం చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల(పీయూసీ) చైర్మన్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఆయన అధ్యక్షతన పీయూసీ భేటీ జరిగింది. కొత్త విధానం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరిగిందని, అయితే దీని అమలుపై పర్యవేక్షణ కొరవడిందని కమిటీ అభిప్రాయపడిందన్నారు. అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
సమావేశంలో మైనింగ్, పరిశ్రమల శాఖలపై సమీక్ష జరిపారు. గ్రానైట్ పరిశ్రమలను మైనింగ్ కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని చెప్పారు. కొత్త ఇసుక పాలసీపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, రాయితీలు తదితర అంశాలపైనా చర్చ జరిపారు.