అపార్ట్మెంట్లో చోరీ..
మియాపూర్(హైదరాబాద్): కాపలా ఉండాల్సిన వ్యక్తే దొంగతనానికి పాల్పడ్డాడు. మదీనగూడలో ఇటీవల జరిగిన ఈ సంఘటన వివరాలు.. మియాపూర్ డీఐ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. మెదక్ జిల్లా సదాశివపేట గ్రామానికి చెందిన నాగరాజు అలియాస్ రాజు (36) మియాపూర్ మదీనగూడాలోని పూజితా రెసిడెన్సీలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. అదే అపార్టుమెంట్ ఐదో అంతస్తులో ఉంటున్న తిర్మలరావు ఈనెల 3వ తేదీన ఊరెళ్లాడు.
అతని ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించిన వాచ్మెన్ రాజు దొంగతనానికి పథకం పన్నాడు. ఆ ఫ్లాట్ కిటికీ గ్రిల్స్‌ను తొలగించి లోపలికి ప్రవేశించాడు. బీరువా తాళాలను పగులగొట్టి అందులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించాడు. ఈనెల 4వ తేదీన తిర్మలరావు తిరిగి వచ్చి చూసి దొంగతనం జరిగిందని తెలుసుకున్నాడు. ఆయన మియాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాచ్‌మన్‌పై అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకు విచారించగా నేరాన్ని అంగీకరించాడు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.