న్యాయమే గెలిచింది
కదిరి : తలుపుల మండల పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఈసీ సభ్యులు పూలశ్రీనివాసరెడ్డితో పాటు మరో 30 మందిపై పోలీసులు పెట్టిన తప్పుడు కేసును శుక్రవారం కదిరి కోర్టు కొట్టివేసింది. దాడి నిజం కాదంటూ నమ్ముతూ ఏజేఎఫ్సీఎం ఆదినారాయణ కేసు కొట్టి వేస్తున్నట్లు ప్రకటించారు. 2014 ఏప్రిల్ 9న సాధారణ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు తలుపుల పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి, స్టేషన్ ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారంటూ ఆ మండల పోలీసులు వారిపై ఐపీసీ సెక్షన్ 143, 188, 353, 427, 506తో పాటు పీపీ యాక్టు కింద అప్పట్లో కేసు (క్రైం నెం 51/2014) నమోదు చేశారు.
డిఫెన్స్ వారి తరపున న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి తన వాదనలు బలంగా విన్పించారు. స్టేషన్‌పై దాడి పూర్తిగా అవాస్తవమని ఆయన కోర్టు ముందు వాదించారు. ప్రాసిక్యూషన్ తరపున ప్రభుత్వ న్యాయవాది ఖాదర్‌బాషా తన వాదనలు విన్పించారు. చివరకు దాడికి గల బలమైన ఆధారాలు లేవంటూ కోర్టు నమ్ముతూ ఈ కేసును కొట్టివేసింది. అనంతరం పూల శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి సిద్దారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని తాము నమ్మినామని, చివరకు న్యాయమే గెలిచిందన్నారు. ఇప్పటికైనా పోలీసులు తప్పుడు కేసులు బనాయించడం మానుకోవాలని వారు హితవు పలికారు.