రోడ్డుపైనే గిరిజన మహిళ ప్రసవం
కాన్పు కోసం వెళ్తే నీళ్లులేవని వెనక్కి పంపిన ఆస్పత్రి సిబ్బంది
► మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట పీహెచ్సీలో ఘటన
నవాబుపేట: ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు సురక్షి తం, సుఖవంతం.. ఇదీ ప్రభుత్వం, అధికారులు పదేపదే చెబుతున్న మాట. కానీ ఆస్పత్రిలో నీళ్లు లేవని కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణిని వెనక్కి పం పించారు సిబ్బంది. పురిటినొప్పులతో బాధపడు తున్న ఆమె నడిరోడ్డుపైనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
మండలంలోని నాగమ్మగడ్డ తండాకు చెందిన శారదమ్మ మూడో కాన్పు కోసం భర్త పున్యానాయక్, పక్కింటి మహిళ మల్లమ్మతో కలసి ఆదివారం రాత్రి నవాబుపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి ఆటో లో వచ్చింది. ప్రసవం చేయాల్సిన ఆస్పత్రి సిబ్బంది.. ‘ఇక్కడ నీళ్లు లేవు.. మరో ఆస్పత్రికి వెళ్లండి’ అంటూ ఉచిత సలహా ఇచ్చి పంపించేశారు. దీంతో వారు స్థానిక బస్టాండ్ ప్రాంగణానికి చేరుకున్నారు. స్థానికు లు ఆమె ఇబ్బందిని గమనించి ‘108’ అంబులెన్స్ వాహనానికి సమాచారం ఇచ్చారు. నొప్పులు మరీ అధికమవడంతో అక్కడే ఉన్న ఆటోడ్రైవర్ తదితరు లు చీరను అడ్డుపెట్టగా కాన్పు చేశారు. శారదమ్మ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
సిబ్బందిపై డీఎంహెచ్ఓ ఆగ్రహం
ఆస్పత్రి సిబ్బంది తీరుపై డీఎంహెచ్ఓ శ్రీనివాస్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం నవాబు పేట పీహెచ్‌సీని సందర్శించి, నిర్లక్ష్యంగా వ్యవహరిం చిన మండల వైద్యాధికారి మోహన్‌పై చర్యలు తీసుకుని, కలెక్టర్‌కు నివేదిక ఇస్తామన్నారు.