ఆస్పత్రి నిధులు హాంఫట్
నిజామాబాద్ అర్బన్,న్యూస్‌లైన్ : జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, మూడు ఏరియా ఆస్పత్రులు, ఒక జిల్లా ఆస్పత్రి ఉంది. వీటిలో ప్రతి ఏడాది పీహెచ్‌సీలకు రూ. 1.75 లక్షలు, ఏరియా ఆస్పత్రులకు రూ. 2 లక్షలు, జిల్లా ఆస్పత్రికి రూ. 5 లక్షల చొప్పున అభివృద్ధి నిధులు మంజూరవుతాయి.
ఈ నిధులతో ఆస్పత్రులలో కనీస సౌకర్యాలు కల్పించడంతోపాటు వైద్య పరికరాలను కొనుగోలు చేస్తారు. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిధులను వినియోగిస్తారు. కమిటీకి చైర్మన్‌గా సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్(ఎస్పీహెచ్ఓ), మెడికల్ ఆఫీసర్, గ్రామ పంచాయతీ సర్పంచ్ సభ్యులుగా ఉంటారు. మిగిలిపోయిన నిధులను కమిటీ నిర్ణయం మేరకు జిల్లా కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది.
ఏం జరుగుతోంది
కొన్ని సంవత్సరాలుగా ఆస్పత్రి అభివృద్ధి నిధులను అధికారులు సక్రమంగా వినియోగించడం లేదు. పీహెచ్సీలలో ఎస్పీహెచ్ఓలు, మెడికల్ వైద్యులు కలిసి నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రులలో అవసరం లేకున్నా నిధులు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో కేవలం 20 ఆస్పత్రులలో మాత్రమే ఆప రేషన్లు చేసేందుకు సౌకర్యాలు ఉన్నాయి. మిగితా 22 ఆస్పత్రులలో ఆ అవకాశం లేదు. ఆపరేషన్ థియేటర్లు కూడా లేవు. కానీ, ఈ దవాఖానాలకు కూడా ఆపరేషన్‌కు సం బంధించిన పరికరాలు, ఇతరత్రా విలువైన పరికరాలు కొనుగోలు చేసినట్లు తప్పుడు బిల్లులు సమర్పించినట్లు సమాచారం.
ఎక్కడెక్కడ
ఈ క్రమంలో లక్షలాది రూపాయలు అధికారుల జేబులలోకి వెళ్తున్నాయి. జిల్లాలోని లింగంపేట, గాంధారి, జుక్కల్, జిల్లా ఆస్పత్రిలో ఈ తరహాలో నే నిధులును మిం గేసినట్లు తెలుస్తోంది. డిచ్పల్లిలోని ఆస్పత్రిలో మొక్క లు నాటడానికి రూ. 5 వేలు ఖర్చు అయితే రూ. 36 వేలు వెచ్చించినట్లు చూపించారు. జిల్లా ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా శానిటేషన్‌కు నిధులను కేటాయించారు. వాస్తవానికి జిల్లా ఆస్పత్రిలో శానిటేషన్‌కు వైద్యవిధాన పరిషత్ నిధులను విడుదల చేస్తుంది. ఇలా ప్రతి ఆస్పత్రిలో నిధుల వినియోగంలో అవినీతి జరుగుతోంది. అభివృద్ధి కమిటీ సభ్యుల మొదలు జిల్లా వైద్యశాఖ కార్యాలయంలోని సెక్షన్ ఉద్యోగి వరకు పంపకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఆడిట్ తీరూ అదే
ఆస్పత్రులలో నిధుల వినియోగంపై ఏటా ఆడిట్ నిర్వహిస్తారు. లొసుగు లు బయట పడకుండా ప్రతి పీహెచ్సీ నుంచి రూ. 5 వేలు వసూలు చేసి ఆడిటర్లకు ఇస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి జిల్లా కార్యాల యంలోని ఒక సూపరిండెంట్ ప్రధానసూత్రధారిగా చెప్పుకుంటున్నారు.