‘చౌక’చక్యంగా తరలింపు
చీరాల, న్యూస్‌లైన్: పేదల బియ్యాన్ని భోంచేసే వ్యాపారులు తమ అక్రమ వ్యాపారానికి సరికొత్త పంథా ఎంచుకున్నారు. ‘ట్రాక్టర్లు, ఆటోలు, లారీల్లో చౌక బియ్యం తరలిస్తుంటే అందరికీ అనుమానం వస్తుంది. అధికారులు దాడులు చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇన్ని బాధలు లేకుండా ఏంచేయాలి’ అని ఆలోచించారు. వెంటనే ‘ఐడియా’ అని అరిచారు. టీవీఎస్ మోపెడ్లను లైన్లో పెట్టారు. కొంతమంది వ్యక్తులను కూలీకి కుదుర్చుకుని మోపెడ్లపై నుంచి బియ్యం తరలించడం మొదలు పెట్టారు. ఈ దందా చీరాల, వేటపాలం, చినగంజాం ప్రాంతాల్లో హెచ్చు మీరుతోంది.
రేషన్ దుకాణాల నుంచి బియ్యం తరలించే కార్యక్రమాన్ని ఓ నెలలో 15 వ తేదీ లోగా పూర్తి చేస్తున్నారు. ఈ సమయంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా.. అనుమానం రాకుండా బియ్యాన్ని ప్లాస్టిక్ గోతాల్లో పెట్టి కట్టేస్తున్నారు. ఓ మోపెడ్‌పై రెండు గోతాల చొప్పున ఉంచి మిల్లులకు తరలిస్తున్నారు. ఇలా ఒక్కో వాహనం ద్వారా రోజుకు నాలుగైదు ట్రిప్పులుగా బియ్యాన్ని చేరవేస్తున్నారు. మొత్తంమీద 20 మోపెడ్లు అక్రమ రవాణాలో పాలుపంచుకుంటున్నాయి. ఈ తరహా తరలింపుపై ఎవరి దృష్టీ పడకపోవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. ఈ బియ్యాన్ని బాపట్లలోని మిల్లులకు తరలించిన తర్వాత.. రీసైక్లింగ్ చేస్తూ ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు.
దేశాయి పేట గోడౌన్ కీలకం..
చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లోని తెల్లకార్డుదారుల కోసం నెలకు వెయ్యి టన్నుల రేషన్ బియ్యం దేశాయిపేటలోని గోడౌన్‌కు చేరుతుంది. అయితే అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. వివిధ మార్గాల్లో బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మొత్తం బియ్యంలో 600 టన్నుల దాకా ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నాయి. డీలర్ల వద్ద నుంచి కిలో *10 కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. మిల్లర్లకు *13 చొప్పున విక్రయిస్తున్నారు.
అధికారులు ఎందుకు ఉన్నట్లు?
డీపోల నుంచి పట్టపగలే రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నా రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రం మమ అనిపిస్తున్నారు. అక్రమార్కుల నుంచి పెద్ద ఎత్తున మామూళ్లు అందుతుండడంతో మెతక ధోరణి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా చలించడంలేదు. గతంలో 6ఏ కేసులు నమోదు చేసేవారు.. ఇప్పుడు సాహసించకపోవడం గమనార్హం. దీంతో పాత వ్యాపారులతో పాటు కొత్తవారు కూడా అక్రమ వ్యాపారానికి దిగారు. ప్రాంతాల వారీగా రేషన్ డిపోలను పంచుకున్నారు. మోటుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి అధికార పార్టీ అండదండలను చూసుకొని పెట్రేగిపోతున్నాడు.