ఇదేమి దౌర్జన్యం...?
- రైతులు ప్రశ్నించినా పట్టించుకోక జులుం
– ‘పురుషోత్తపట్నం’ రైతుల భూములూ స్వాధీనం
- సంతకాలు చేయని రైతుల భూములపై దౌర్జన్యం
- అడ్డుకున్న కర్షకులపై పోలీసుల జులుం
- ఓ రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం
– అడ్డుకున్న పోలీసులు ... గృహ నిర్బంధం
సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైపులైన్ పనుల పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసులు మోహరించి భయోత్పాతం సృష్టించారు. భూసేకరణలో సంతకాలు చేయని రైతుల భూములను సోమవారం బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. నాగంపల్లి, వంగలపూడి, చినకొండేపూడి, పురుషోత్తపట్నం రెవెన్యూ పరిధిలోని 334 మందికి చెందిన 206.24 ఎకరాలు భూసేకరణలో ఉంది. అయితే వీరిలో 244 మంది రైతులు సంతకాలు చేశారు. ఆయా రెవెన్యూ గ్రామాల్లో అవార్డ్ ఎంక్వయిరీ గ్రామ సభలు నిర్వహించి అవార్డ్ పాస్ చేసి రైతుల భూములను స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రంగప్రవేశం చేశారు. ఆదివారం సంతకాలు చేయని రైతుల భూముల్లో జలవనరుల శాఖకు రెవెన్యూ శాఖ రైతుల భూములను అప్పగించగా పైప్‌లైన్ పనులు ప్రారంభించగా రైతులు అడ్డుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు 250 మంది స్పెషల్ ఫోర్స్, అడిసనల్ ఎస్పీ గంగాధర్, రవిశంకర్‌రెడ్డి, ఐదుగురు డీఎస్పీలు, పదిమంది సీఐలు, 23 మంది ఎస్సైలు తూర్పు, పశ్చిమ జిల్లాల నుంచి తరలివచ్చారు. పురుషోత్తపట్నం, రామచంద్రపురం, చినకొండేపూడి, నాగంపల్లిలో 144 సెక్షన్ అమలు చేశారు. సీతానగరం బస్టాండ్ సెంటర్, నాలుగు బొమ్మల సెంటర్, నాగరత్నం కాలనీ ఏటిగట్టు వద్ద, సింగవరం, వంగలపూడి, రామచంద్రపురం, పురుషోత్తపట్నంల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. పురుషోత్తపట్నం వైపు వెళ్ళే వాహనాలను నిలుపుదల చేశారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వద్ద పోలీసులు వలయంగా ఏర్పడి ఎవరిని హెడ్‌వర్క్ పనుల వద్దకు వెళ్ళకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.
ఓ రైతు జంట ఆత్మహత్యాయత్నం...
హెడ్‌వర్క్ వద్ద సంతకం చేయని రైతు కరుటూరి శ్రీనివాస్ భూమి 2.42 ఎకరాలను స్వాధీనం చేసుకోవడంతో తన భార్య రజనీతో సహా పురుగులమందు డబ్బాతో ఆత్మహత్య చేసుకుంనేదుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ ఇంటివద్ద పెద్దసంఖ్యలో పోలీసులు కాపాలగా ఉన్నారు. పెద్దసంఖ్యలో పురుషోత్తపట్నం చేరుకొన్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నార్త్‌జోన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ రైతులతో చర్చించగా ‘మేము అప్పగించకుండా తమ భూములు తీసుకోవడం ఏమిటని’ రైతులు ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్‌ను పోలీసులు సీతానగరం స్టేషన్‌కు తరలించారు.
రైతులు కోరితే బ్యాంకులో పరిహారం...
సంతకాలు చేయని రైతులు రికార్డులను అందజేస్తే భూసేకరణ చట్టం కింద వచ్చే నగదును బ్యాంకులో నేరుగా వారి ఖాతాలో జమ చేస్తామని లేదా కోర్టులో పరిహారం జమ చేస్తామని జలవనరుల శాఖ ఈతఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమలో జలవనరుల శాఖ డీఈ వెంకట్రావు, ఏఈఈ కృష్ణప్రసాద్, తహాసీల్దార్ చంద్రశేఖరరావు, ఆర్ఐ సుధాకర్, వీఆర్వోలు పాల్గొన్నారు.