అక్షరాలా అరకోటి
ఆదివారమూ పోటెత్తిన పుష్కర భక్తులు గంటల తరబడి క్యూలు, రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు
సాక్షి నెట్వర్క్: పుష్కర భక్తులకు ఆదివారం కూడా ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. ఆదివారం ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 52.39 లక్షల మంది భక్తులు పుష్కర క్షేత్రాలను సందర్శించారు! దాంతో ప్రధాన పుష్కర ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించింది. భద్రాచలం, కాళేశ్వరం, బాసర ప్రాంతాల్లో వేలాది వాహనాలు ట్రాఫిక్ రద్దీతో చిక్కి భక్తులు అల్లాడిపోయారు.
భద్రాచలంలో ఐదారు గంటల పాటు వాహనాలు కదిలే పరిస్థితి లేకపోవడంతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి కాలినడకన వెళ్లి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. కాళేశ్వరంలోనూ 20 కిలోమీటర్ల వర కు ట్రాఫిక్ స్తంభించడంతో మంత్రి ల క్ష్మారెడ్డి, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు రద్దీ తగ్గించే చర్యలు చేపట్టారు. వాహనాల్లోని భక్తులకు నీళ్లు, ఆహార ప్యాకెట్లను అందించారు. బస్సు లు ఏ మూలకూ చాలక భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వర్షం కురవడం వారి కష్టాలను మరిం త పెంచింది.
గూడెం ఘాట్‌లో సౌకర్యాల గురించి మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ భక్తులను అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల మంత్రులు పుష్కర స్నానం చేశారు. తెలంగాణలో ఇప్పటివరకు 2.5 కోట్ల మంది భక్తులు పుణ్యసాన్నాలు చేశారని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. భక్తులు అంచనాలకు మించి తరలి వస్తున్నారన్నారు.
విషాదం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వాసి గాదంశెట్టి శ్యాం సుందర్(66) భద్రాచలంలో పుణ్యస్నానం అనంతరం స్వామి దర్శనానికి క్యూలో ఉండగా సృహ తప్పి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఖమ్మం అశ్వాపురం మండలం నెల్లిపాకబంజర వద్ద పుష్కరస్నానానికి వచ్చిన దిలిశాల సత్యనారాయణ అనే పశువైద్యుడు నెల్లిపాక వద్ద పడవ ఎక్కి అవతలి ఒడ్డుకు వెళ్తూ గల్లంతయ్యాడు. నర్సాపూర్ వద్ద ఆయన మృతదేహం లభ్యమైంది.
తగినన్ని బస్సులు నడపండి
* పుష్కరాలపై సమీక్షలో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రెండ్రోజులుగా భక్తుల రద్దీ పెరిగినందున పుష్కరాల్లో ట్రాఫిక్ జామ్ లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే ఎక్కడ ఎన్ని బస్సులు అవసరముంటే అన్ని పంపాలని ఆర్టీసీ ఎండీ రమణారావును ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లను తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం ప్రతినిత్యం సమీక్షిస్తున్నారు.
వివిధ జిల్లాల్లోని పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రులు హరీష్‌రావు, తుమ్మల, జగదీష్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న తదితరులతో ఆదివారం మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ అనురాగ్‌శర్మ, ఇతర పోలీసు అధికారులు బాసర నుంచి భద్రాచలం వరకు హెలికాప్టర్లో తిరుగుతూ పరిస్థితిని సమీక్షించారు.