అమెరికా.. రష్యా మధ్య మళ్లీ వార్?
అమెరికా.. రష్యా.. ఒకప్పుడు ప్రపంచంలో ఈ రెండే అగ్ర రాజ్యాలు. తర్వాతి కాలంలో యూఎస్ఎస్ఆర్ పలు దేశాలుగా విడిపోవడంతో రష్యా ప్రాభవం కొంత తగ్గినా, ఇప్పటికీ కొంతవరకు ఆధిపత్యం చూపిస్తూనే ఉంది. అయితే, డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత రెండు దేశాల మధ్య సబంధాలు కాస్త మళ్లీ అటూ ఇటూగా కనిపిస్తున్నాయి. అమెరికన్ అధికారులు, అమెరికా మీడియాలో ఉన్న హిస్టీరియా కారణంగా తమ ఇరు దేశాల మద్య సంబంధాలు దెబ్బతింటున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కొవ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో రష్యా హ్యాకింగ్‌కు పాల్పడిందంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. అసలు ఏ దేశానికైనా వాళ్ల సొంత ఎన్నికల వ్యవస్థలో గానీ, వాళ్ల స్వదేశీ వ్యవహారాల్లో గానీ మరో దేశం జోక్యం చేసుకుంటోందన్న ఆలోచన రావడమే బలహీనతకు నిదర్శనమని పెస్కొవ్ అన్నారు.
అమెరికన్ రాజకీయాల్లో తాము వేలు పెట్టేది లేదని, అసలు అలాంటి ఆలోచనే తమకు లేదని స్పష్టం చేశారు. ఇదంతా అమెరికన్ అధికారులు, అమెరికా మీడియాలో వస్తున్న హిస్టీరియా తప్ప మరేమీ కాదని.. దీనివల్ల అనవసరంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించారు. అమెరికా ఇప్పటికీ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలోనే ఉందని.. అక్కడ సుస్థిరమైన ప్రభుత్వంతో తాము సంబంధాలు కోరుకుంటున్నామని తెలిపారు. చర్చలకు తగిన వాతావరణం లేకపోతే.. అది చాలా దురదృష్టమని పెస్కొవ్ వ్యాఖ్యానించారు. ఇది భావోద్వేగ పరమైన ఉగ్రవాదం అని విమర్శించారు. అతి కొద్ది కాలం పాటు ట్రంప్ ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న మైక్ ఫ్లిన్‌తో సంబంధాల గురించి అమెరికాలో రష్యా రాయబారి సెర్గీ కిస్లియాక్‌ను అమెరికా క్షుణ్ణంగా పరిశీలించిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనల వల్ల పరస్పర విశ్వాసం దెబ్బతింటుందని, అయితే కొన్నాళ్ల తర్వాతైనా కాస్త విశాలంగా ఆలోచించాలని సూచించారు. కనీసం చైనా వాళ్లలాగైనా ఉండాలని చెప్పారు. వాళ్లు దశాబ్దాలు, శతాబ్దాల గురించి ఆలోచిస్తారని.. అందువల్ల వాళ్లతో తమ సంబంధాలు సాధారణంగానే ఉన్నాయని తెలిపారు.