puttagunta Satish Kumar
-
‘పుట్టగుంట’ కేసు దర్యాప్తు వేగవంతం
హనుమాన్‌జంక్షన్ : హనుమాన్జంక్షన్కు చెందిన పారిశ్రామిక వేత్త పుట్టగుంట సతీష్‌కుమార్‌కు మావోయిస్ట్ పార్టీ నేతల పేరుతో వస్తున్న బెదిరింపు ఫోన్‌కాల్స్‌పై పోలీసుల దర్యాప్తు ఊపందుకుంది. మావోయిస్టు నేతగా చెప్పుకుంటున్న వ్యక్తి మాట్లాడుతున్న ఫోన్ నంబర్, అతను ఇచ్చిన బ్యాంకు అకౌంట్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కాల్‌డేటాను సేకరించిన పోలీసులకు వరంగల్, కరీంనగర్ పరిసర ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నట్లు నిర్ధారణ కావటంతో ఇప్పటికే ఒక టీంను అక్కడకు పంపారు. ఈ కేసుపై అధికార పార్టీ నేతల నుంచి పోలీసులకు ఒత్తిడి పెరగటంతో దర్యాప్తు వేగవంతం చేశారు. పార్టీ ఫ్లీనరీ కోసం విరాళం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు పార్టీ నేతల నుంచి నాలుగైదు రోజులుగా వస్తున్న బెదిరింపు ఫోన్‌కాల్స్ పరంపర సోమవారం కూడా కొనసాగింది. ఫలించని పోలీసు వ్యూహం... మావోయిస్టు పార్టీ నేత గణపతి పేరుతో ఫోన్‌కాల్స్ చేస్తున్న వ్యక్తి డబ్బులు జమ చేసేందుకు పుట్టగుంట సతీష్‌కుమార్‌కు రెండు బ్యాంకు అకౌంట్ నంబర్లు ఇచ్చాడు. వీటి ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు సోమవారం పోలీసులు వేసిన వ్యూహం విఫలమైంది. వరంగల్‌కు 50 కి.మీ దూరంలో జమ్మిగుంట పట్టణానికి చెందిన ఆంధ్రాబ్యాంకు అకౌంట్ నంబర్‌ను మావోయిస్టులు ఇవ్వటంతో దానిపై నిఘా పెట్టారు. ఆ బ్యాంకు బ్రాంచి మేనేజర్ కాశీ విశ్వేశ్వరరెడ్డి, జమ్మిగుంట సీఐతో హనుమాన్‌జంక్షన్ సీఐ వై.వి.రమణ, ఎస్.ఐ నాగేంద్రకుమార్ మాట్లాడారు. మావోయిస్టు బెదిరింపు ఫోన్‌కాల్స్ కేసు వివరాలను పూర్తిగా వారికి వివరించి నిందితులను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకునేందుకు ప్రణాళిక రచించారు. మావోయిస్టులు తెలిపిన బ్యాంకు అకౌంట్ జమ్మిగుంటకు సమీపంలోకి కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతి నర్సయ్య పేరిట ఉందని విచారణలో వెల్లడైంది. ఏటీయం సదుపాయం లేకపోవటంతో ఖచ్చితంగా బ్యాంకుకు వచ్చి నగదు డ్రా చేసుకుని వెళ్లాల్సిందేనని మేనేజర్ వెల్లడించారు. దీంతో వ్యూహం ప్రకారం ముందస్తుగా బ్యాంకు వద్ద జమ్మిగుంట పోలీసులను నిఘా పెట్టించి మావోయిస్టు నేతకు పుట్టగుంటతో ఆంధ్రాబ్యాంకు అకౌంట్లో తొలి విడతగా రూ.20 వేలు నగదు జమ చేసినట్లుగా ఫోన్ చేయించారు. ఈ నగదును డ్రా చేసుకునేందుకు బ్యాంకు వద్దకు వస్తే నిందితుడు తమ చేతికి చిక్కినట్లేననే పోలీసులు భావించారు. కానీ బ్యాంకు వద్ద జమ్మిగుంట పోలీసులు రోజంతా పడిగాపులు పడినా ఆ అకౌంట్ నుంచి నగదు డ్రా చేసేందుకు ఎవరూ రాకపోవటంతో నిరాశ చెందారు. సదరు బ్యాంకులో ఖాతా తెరిచేందుకు తెల్పిన ఆడ్రస్సు, పాస్‌పోర్టు సైజు ఫొటో ఆధారంగా చేసుకుని నిందితుని ఆచూకీకోసం ఆరా తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఖాతాదారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందని హనుమాన్‌జంక్షన్ సీఐ వై.వి.రమణ తెలిపారు. -
‘పుట్టగుంట’కు మావోయిస్టుల బెదిరింపు ఫోన్‌కాల్స్
హనుమాన్‌జంక్షన్ : హనుమాన్జంక్షన్కు చెందిన పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్‌కుమార్‌కు మావోయిస్టు పార్టీ నేతల పేరుతో బెదిరింపు ఫోన్‌కాల్స్ రావటం స్థానికంగా కలకలం సృష్టించింది. గత నాలుగు రోజులుగా వరుస ఫోన్‌కాల్స్ రావటంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టు పార్టీ ఆగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి పార్టీకి ప్లీనరీ నిర్వహణకు నిధులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు నాలుగైదు సార్లు ఫోన్‌కాల్స్ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో కూడా కాల్ వచ్చింది. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై జంక్షన్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సతీష్ ఇల్లు, కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆయనకు వచ్చిన ఫోన్ నంబరుపై నిఘా పెట్టారు. నిజంగా మావోయిస్టులు చేస్తున్నారా? లేక వారి పేరుతో డబ్బు వసూలు కోసం ఇతరులెవరైనా యత్నిస్తున్నారా ? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే ఆ ఫోన్ నంబరుకు సంబంధించిన కాల్‌డేటాను పోలీసులు సేకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి ఆ వ్యక్తి ఫోన్ చేస్తున్నట్లుగా గుర్తించారు. వాస్తవానికి ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని శ్రీకాకుళం జిల్లా నుండి మాట్లాడుతున్నట్లు సదరు వ్యక్తి తొలుత పుట్టగుంటకు ఫోన్లో చెప్పాడు. కాల్‌డేటాను పరిశీలిస్తే వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి ఫోన్ చేసినట్లు వెల్లడైంది. ఏఎస్సై నేతృత్వంలో ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన బృందం వరంగల్ చేరుకుని అక్కడి పోలీసుల సహకారంతో విచారణ చేస్తోంది. నకిలీ ఆధారాలతో బ్యాంకు ఖాతా.. పుట్టగుంట సతీష్‌కుమార్‌కు మావోయిస్టు నేత గణపతి పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి ఇచ్చిన బ్యాంకు ఖాతా వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. కరీంనగర్ సమీపంలోని ఐ.సి.ఐ.సి.ఐ బ్రాంచ్‌లో ఈ ఖాతా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖాతాకు సంబంధించి బ్యాంకు అధికారులకు ఇచ్చిన ఆడ్రస్సు, ఇతర ఆధారాలు సరైనవి కాకపోవటంతో పాటు నగదును కూడా పూర్తిగా ఏటీఎం ద్వారానే డ్రా చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఆ ఖాతాలోకి ఎప్పుడెప్పుడు, ఎవరి ఖాతాల లోంచి ఎంత మొత్తంలో నగదు జమ అయింది.. అనే సమాచారాన్ని బ్యాంకు అధికారుల నుంచి పోలీసులు సేకరిస్తున్నారు. ఆగ్రనేతే ఫోన్ చేస్తాడా? సాక్షాత్తూ మావోయిస్టు పార్టీ ఆగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పేరుతో బెదిరింపు ఫోన్‌కాల్స్ రావటంపై పోలీసుల్లో సైతం విస్మయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి రికార్డు చేసిన బెదిరింపు ఫోన్‌కాల్స్‌లోని వ్యక్తి మాటతీరును బట్టి అతడికి సుమారు 35 ఏళ్ల వయస్సు ఉండవచ్చని తెలిసింది. కానీ గణపతికి 60 ఏళ్లు పైబడి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.