కూతురితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం.. కూతురి మృతి
ఆదిలాబాద్: కుటుంబ కలహాలతో కూతురితో సహా తల్లి పురుగుల మందు తాగింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం రంగంపేటలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. రంగంపేట గ్రామానికి చెందిన పుట్టపాక భాగ్యలక్ష్మి (33) భర్తతో విడాకులు తీసుకొని తల్లి వద్ద ఉంటోంది. అక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఈ క్రమంలో అన్నతో వచ్చిన మనస్పర్థల కారణంగా గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూల్డ్రింక్ తీసుకువచ్చి అందులో పురుగులమందు కలిపి కూతురు వైశాలి(8)కి ఇచ్చి భాగ్యలక్ష్మి కూడా తాగింది. దీంతో వైశాలి అక్కడికక్కడే మృతిచెందగా.. భాగ్యలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది.