రాష్ట్రపతి పర్యటన స్థలాలు ఎస్పీ పరిశీలన
ఆకివీడు:భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ నెల 26వ తేదీన సందర్శించనున్న మండలంలోని అయిభీమవరం గ్రామాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి పరిశీలించారు. మూడు హెలికాప్టర్లు దిగేందుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. అయితే గత సంవత్సరం రాష్ట్రపతి వస్తారని భావించిన సందర్భంలో హెలిపాడ్ కోసం కేటాయించిన స్థలాన్నే ఇప్పుడు వాడాలని అధికారులు నిర్ణయించారు. ఆ స్థలాన్ని డీఎస్పీ కె.రఘువీరారెడ్డితో కలసి ఎస్పీ పరిశీలించారు. అనంతరం రాష్ట్రపతి ప్రారంభించబోయే వేదపాఠశాల నూతన భవనం వద్దకు వచ్చారు.
అక్కడ టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు రాష్ట్రపతి సందర్శన, కార్యక్రమం వివరాలను ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి సందర్శించబోయే అన్ని ప్రాంతాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ మాజీ సభ్యులు పుత్తూరి ఆంజనేయరాజు, సీఐ కేఏస్వామి, ఎస్ఐ కేఎస్వీ ప్రసాద్, రహదారులు భవనాల శాఖ డీఈఈ డి.దేవేంద్రరాజు, ఏఈ ఏ.వర్మ, సర్వేయర్ విష్ణుమూర్తి స్థానిక ప్రముఖులు బిల్డర్ కె.రామకృష్ణంరాజు, కె.బలరామరాజు (మునసారి రాంబాబు), కె.లక్ష్మణరావు, ఎం.డి. షమీమ్ తదితరులు పాల్గొన్నారు. నరసాపురం ఆర్డీ వో డి.పుష్పమణి మంగళవారం సాయంకాలం హెలిపాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు.
పర్యటన వివరాలు
బాపిరాజు రాష్ట్రపతి పర్యటన వివరాలను ఇలా తెలిపారు... 26వ తేదీ ఉదయం 11.45 గంటలకు అయిభీమవరంలోని వేదపాఠశాల వద్దకు రాష్ట్రపతి చేరుకుంటారు. ముందుగా సాంస్కృతిక వేదిక ముఖ ద్వారం వద్ద వేదపండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలుకుతారు. మొదటగా ప్రవేశద్వారం వద్ద ఉన్న షిర్డీసాయిబాబా దర్శనం, ఆ పక్కనే ఉన్న కంచికామకోటి పీఠాధిపతి శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి ప్రధాన ధ్యానమందిరం దర్శనం చేసుకుంటారు. వేద పాఠశాల భవనం ముందున్న సరస్వతీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి భవనాన్ని ప్రారంభిస్తారు. భవన పరిశీలన చేస్తారు. అక్కడ నుంచి విద్యార్థులు, అధ్యాపకుల నివాస భవన ప్రాంగణంలో ఉన్న యాగశాలకు చేరి ఉదయం నుంచి జరిగిన హోమాలకు రాష్ట్రపతి పూర్ణాహుతి సమర్పిస్తారు. అక్కడే ఉన్న గోశాలను సందర్శించి గోపూజ చేస్తారు. అక్కడే ఉన్న పుష్కరిణిని పరిశీలిస్తారు. అనంతరం ఆయన ప్రారంభించిన భవనం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యసిస్తారు. దీంతో కార్యక్రమం పూర్తవుతుంది. 12.45 గంటలకు హెలీపాడ్ వద్దకు చేరి అక్కడ నుంచి తిరుపతి వెళతారని బాపిరాజు వివరించారు.