ఉప్పెనలా ఉద్యమం
సాక్షి, అనంతపురం : ఓ వీధిలో పది మంది కలుస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమాన్ని చేయాలనుకుంటున్నారు. తమకొచ్చే ఆదాయం అంతంతమాత్రమే అయినా.. తలా వంద, రెండొందలు చందాలు వేసుకుంటున్నారు. ప్లకార్డులు లేదా బ్యానర్లు లేదా ఫ్లెక్సీలు తయారు చేయించుకుని... ఆటో, మైకు మాట్లాడుకుని ‘జై..సమైక్యాంధ్ర’ అంటూ రోడ్లపైకి
వస్తున్నారు. ప్రతి వీధి నుంచి ఇలాగే స్వచ్ఛందంగా జనం రోడ్లపైకి వస్తుండడంతో ఆ పది మంది కాస్తా... వందలాది, వేలాది మంది అవుతున్నారు. వారి సమైక్య నినాదాలతో ‘అనంత’ మార్మోగుతోంది.
ప్రస్తుతం ఉద్యమిస్తున్న వారిలో ఎవరూ నాయకులు కాదు. ఏ రోజూ మైకు పట్టుకుని మాట్లాడిన వారు కాదు. అయినా.. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఉద్యమ సెగను ప్రజ్వలింపజేస్తూ.. ఢిల్లీకి వినిపించేలా పొలికేక పెడుతున్నారు. 12వ రోజైన శనివారం కూడా జిల్లాలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగింది. అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట జాక్టో ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా జాక్టో నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
స్థానిక టవర్‌క్లాక్ సర్కిల్లో నాన్పొలికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఐదో రోజుకు చేరాయి. ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బంది విధులను బహిష్కరించి.. నగరంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రామ్‌నగర్ ట్రాక్టర్ యజమానుల అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 200 ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు. నగరంలోని 48వ డివిజన్ ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమబాట పట్టారు. నగరమంతా ర్యాలీ చేశారు. వీరికి వైఎస్సార్సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి మద్దతు ప్రకటించారు. లక్ష్మీ మహిళా కుట్టు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక నందిని హోటల్ ఎదురుగా ఉన్న వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అలాగే నగరంలోని ప్రధాన వీధులకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలు చేపట్టారు.
స్థానిక సప్తగిరి, టవర్‌క్లాక్ సర్కిళ్లలో కేసీఆర్, సోనియా, దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఎస్కేయూలో విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కేంద్ర మంత్రులు పురందేశ్వరి, జేడీ శీలం, కిల్లి కృపారాణి, కావూరి సాంబశివరావు, చిరంజీవి, పళ్లంరాజు ఫొటోలను ఎనుములకు కట్టి ఊరేగించారు. వర్సిటీ ప్రధాన ద్వారం నుంచి న్యాయశాస్త్ర విభాగం గేటు వరకు ప్రదర్శన కొనసాగింది. ఎనుములను నమ్ముకుంటే పాలు ఇస్తాయని, ప్రజాప్రతినిధులు మాత్రం నమ్మించి నట్టేట ముంచారని విద్యార్థులు విమర్శించారు. వర్సిటీలో విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు పదకొండో రోజుకు చేరాయి. కళాకారులు జానపద గేయాలు, ఆటలతో అలరించారు. కాంగ్రెస్ పార్టీ చర్యలను నిరసిస్తూ, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 48 గంటల జిల్లా బంద్ చేపడుతున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. అన్ని వర్గాలు బంద్‌కు సహకరించి సమైక్యాంధ్ర వాణిని గట్టిగా వినిపించాలని పిలుపునిచ్చారు.
ఊరూ వాడ నిరసనల హోరు
ధర్మవరంలో కమ్మ సంఘం సభ్యులు, వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు, సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఐక్య ఉపాధ్యాయ సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘాల నాయకులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో డీజిల్ ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో దాదాపు 150 ఆటోలతో ర్యాలీ నిర్వహించారు.
రోడ్డుపైనే వంటా-వార్పు చేపట్టారు. గుత్తిలో ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జాక్టో దీక్షలు తొమ్మిదో రోజుకు చేరాయి. పామిడిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ర్యాలీ చేపట్టారు. మునిసిపల్ ఉద్యోగులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఉద్యోగులు నడిరోడ్డుపై కబడ్డీ ఆడారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ చేశారు.
లేపాక్షి, చిలమత్తూరు మండల్లాలో సమైక్య నినాదాలు మిన్నంటాయి. కదిరిలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్‌కో డీఈ వినాయక ప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యోగులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ కూడలిలో మానవహారం నిర్మించారు. వికలాంగుల ర్యాలీ, చెక్కభజనలతో పట్టణం మార్మోగింది. కళ్యాణదుర్గంలో వాల్మీకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పెద్దఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలు దహనం చేశారు. మడకశిరలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్యవాదులు మడకశిర నుంచి పావగడ వరకు పాదయాత్ర చేపట్టారు. నల్లమాడలో దళితులు ర్యాలీ, వంటా వార్పు చేపట్టారు. రొద్దంలో యువకులు బైక్‌ర్యాలీ నిర్వహించారు.
రాయదుర్గంలో ఉద్యోగ, జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి, అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కణేకల్లులో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. రాప్తాడు, సీకేపల్లి మండలాల్లో బంద్, రిలే దీక్షలు చేపట్టారు. శింగనమలలో సమైక్యాంధ్రపై కేజీబీవీ విద్యార్థుల నాటక ప్రదర్శన ఆకట్టుకుంది. తాడిపత్రిలో పాత్రికేయులు రిలే దీక్షలు చేపట్టారు. యాడికిలో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించారు. ఉరవకొండలో చేనేత కార్మికులు ర్యాలీ చేశారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. సోనియా, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. బెళుగుప్పలో సమైక్యవాదులు భారీ ప్రదర్శన చేపట్టారు.