రేపటి నుంచి పోలీసుల భర్తీ ప్రక్రియ
సాక్షి ముంబైః మహారాష్ట్ర పోలీసుశాఖ సోమవారం నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించనుంది. మొత్తం 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు పోలీసు శాఖ పేర్కొంది. ఇటీవలే జరిగిన సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకున్నారు. హోంశాఖ మంత్రి ఆర్.ఆర్ పాటిల్ అధ్యక్షతన సీనియర్ పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలోనూ కొత్త నియామకాలపై చర్చ జరిగింది. అదనంగా ఖాళీలను భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. ఈ మేరకు సోమవారం నుంచి భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తారు. పోలీసుశాఖలో ఐదేళ్లలో 65 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
దీని ప్రకారం ఈ ఏడాది 12,500 మంది పోలీసుల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. వీటికి అదనంగా మరో 7,500 మంది అంటే మొత్తం 20 వేల ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. పోలీసు శాఖలో చేరాలనుకునే అనేక మంది యువకులకు ఇది మంచి అవకాశమని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. తీర ప్రాంతాల భద్రత కల్పించేందుకు కొందరికి శిక్షణ ఇచ్చేందుకు పోలీసు ట్రైనింగ్ సెంటరును ప్రారంభించనున్నారు. దీనికోసం పాల్ఘర్లోని మూడు భవనాలను కేటాయించాలని ప్రతిపాదించారు. దాదాపు 50 ఎకరాల్లో ఈ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. సుమారు 2,500 మందికి ఒకేసారి శిక్షణ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది.. ఇక ఠాణే వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 772 ఉద్యోగాలనూ భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రచారమాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వడం జరిగిందని నగర కమిషనర్ జ్ఞానేశ్వర్ ఫడతరే తెలిపారు.