తెలుగు.. ఎప్పటికీ వెలుగే..
తనికెళ్ల భరణి
నాటకరంగం నుంచి సినీరంగానికి వచ్చి తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న నటుడు తనికెళ్ల భరణి. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన ఎక్కని మెట్టు లేదు. తెలుగు భాషపై పట్టు కలిగిన భరణి భాషాభివృద్ధికి ఎంతగానో కృషిచేస్తున్నారు. తాను తీసే ప్రతి సినిమాలో తెలుగుదనం ఉట్టిపడేలా చూసుకోవడం ఆయన ప్రత్యేకత. నగరంలో ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు..
- విజయవాడ
ప్ర : దర్శకుడిగా, నటుడిగా,రచయితగా, నిర్మాతగా ఇలా చాలా పాత్రలు పోషించారు కదా.. మీకు నచ్చిన, మీరు మెచ్చిన అంశం ఏమిటీ?
జ : అన్నీ నాకు నచ్చినవే. నా నిర్మాత నుంచి నా రచనలకు ఏవిధమైన ఒత్తిడి లేదు. ఇష్టపడి చేసిన అన్ని రంగాలూ నాకు పేరు తెచ్చినవే.
ప్రశ్న : మీరు సినీరంగంలోకి వచ్చాక ఏం నేర్చుకున్నారు?
జ : అదో పద్మవ్యూహం. సినీరంగం నుంచి నేను బతకటం నేర్చుకున్నా. ఈ రంగంలోకి వచ్చి 30 సంవత్సరాలైంది. ప్రస్తుతం ప్రయాణం సుఖంగా సాగుతోంది.
ప్ర : ప్రస్తుతం తెలుగు సినిమా హీరో చుట్టూ కథ తిరుగుతోంది కదా.. సినిమాకు న్యాయం జరుగుతోందా?
జ : నిర్మాతకు న్యాయం జరుగుతోంది కదా..
ప్ర : జంధ్యాల స్మారక పురస్కారంపై మీ స్పందన..
జ : జంధ్యాల అవార్డు నాకు రావటం సంతృప్తినిచ్చింది. 39 సంవత్సరాల కిందట సుమధుర సమాజం ద్వారా ప్రదర్శించిన కొక్కురొక్కో.. నాటకం అవార్డు తెచ్చిపెట్టింది.
ప్ర : తెలుగు అంతరించిపోతోందని మేధావుల వాదన. దీనిపై మీరేమంటారు?
జ : తెలుగు అంతరించిపోదు. 20ఏళ్ల నుంచి వచ్చిన సాహిత్యం చూస్తే చాలు మీకు సమాధానం దొరుకుతుంది. ప్రజల్లో సాహిత్య పిపాస పెరిగింది.
ప్ర : మరి భాషా ఉద్యమాలు..
జ : వారి పని వారిని చెయ్యనివ్వండి.
ప్ర : రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు సినిమా పరిస్థితి ఏమిటీ?
జ : నాకు తెలియదు.
ప్ర : నేటి సినిమాల్లో అరువు తెచ్చుకున్న కథలు, ఎరువు తెచ్చుకున్న గొంతులు ఉంటున్నారుు. దీనిపై మీ కామెంట్.
జ : పాతతరం నటులు చాలామంది బహుభాషా చిత్రా ల్లో నటించారు. వారి ప్రతిభకు భాష అడ్డుకాలేదు. నేను, కోట శ్రీనివాసరావు పరభాషా చిత్రాల్లోనూ నటించాం.
ప్ర : మీరు ‘ప్యాసా’ గ్రంథం రాశారు కదా.. అసలు ప్యాసా అంటే ఏమిటీ?
జ : ప్యాసా అనేది ఉర్దూ పదం.. దాహార్తి అనుకోవచ్చు.
ప్ర : మీరు వేయూలనుకున్న పాత్ర ఏమైనా ఉందా..
జ : శకుని పాత్ర వెయ్యూలని ఉంది.