నా భర్తను పోలీసులే కొట్టి చంపారు
రామాంజనేయులు భార్య కన్నీటిపర్యంతం
గుండెపోటుతో చనిపోయాడంటున్న పోలీసులు
గిద్దలూరు : ఓ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు వారి విచారణ అనంతరం బయటకు వచ్చిన కొద్ది సేపటికే అనుమానాస్పత స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య మాట్లాడుతూ తన భర్త పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తుండగా పోలీసులు మాత్రం తమ విచారణ అనంతరం బయటకు వెళ్లిన తర్వాత గుండెపోటుతో మృతి చెందాడని చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే..
రాచర్ల మండలం కాలువపల్లెకు చెందిన ఉప్పుతోళ్ల రామాంజనేయులు (33)పై అదే గ్రామానికి చెందిన బంధువులు బాలరాజు, ఆయన భార్య సునీతలు కేసు పెట్టారు. సునీతపై రామాంజనేయులు లైంగికదాడికి యత్నించాడన్నది ఆ ఫిర్యాదులోని సారాంశం. ఈ నేపథ్యంలో రాచర్ల పోలీసులు శనివారం రామాంజనేయులును అదుపులోకి తీసుకుని విచారించారు. అక్కడి నుంచి రాత్రి 9 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ నుంచి తన తమ్ముడితో కలిసి రామాంజనేయులు బయటకు వచ్చాడు. ఆ తర్వాత అస్వస్థతకు గురికావడంతో రాచర్లలోని వైద్యశాలకు వెళ్లాడు. పోలీసుల విచారణకు భయపడటంతో ఆయనకు బీపీ ఎక్కువై పరిస్థితి విషమించి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
పడిపోయాకే మా మరిదికి ఫోన్ చేశారు..
తన భర్త రామాంజనేయులుకు ఇతర మహిళలతో ఎలాంటి సంబంధాలు లేవని, అనవసరంగా బాలరాజు, అతని భార్య సునీతలు కేసు పెట్టి పోలీసులతో కొట్టించి చంపేశారని మృతుడి భార్య రమణమ్మ ఆరోపిస్తోంది. తనకు ఒక్కమాట కూడా చెప్పకుండా పోలీసుస్టేçÙన్కు తీసుకెళ్లారని, తీవ్రంగా కొట్టి పడిపోయాక తన మరిదికి ఫోన్ చేసి పిలిపించారని చెబుతోంది. మరిది పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భర్తను బైకుపై తీసుకొచ్చాడని, మార్గమధ్యంలో తనను మూడు లాఠీలు విరిగేలా కొట్టారంటూ మరిదితో తన భర్త చెప్పుకుని బాధపడ్డాడంటూ కన్నీటిపర్యంతమైంది. తానిక బతకనని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఏడ్చిన 10 నిమిషాల్లోనే రాచర్లలోని చిన్న ఆస్పత్రిలో చనిపోయాడని రమణమ్మ భోరున విలపించింది. తనకు, తన ఇద్దరు కుమార్తెలకు దిక్కెవరంటూ ఆమె రోదించడం స్థానికులను కంటతడి పెట్టించింది. బాలరాజు, సునీతలే తన భర్త చావుకు కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
గుండెపోటు వల్లే చనిపోయాడు : సీఐ
పోలీస్‌స్టేషన్ నుంచి శనివారం రాత్రి 9 గంటల సమయంలో బయటకు వచ్చాకే రామాంజనేయులు గుండెపోటుతో మృతి చెందినట్లు సీఐ వి.శ్రీరాం తెలిపారు. కాలువపల్లెకు చెందిన మహిళ.. రామాంజనేయులు తనపై లైంగిక దాడికి యత్నించాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. రాచర్ల పోలీసులు రామాంజనేయులును పోలీస్‌స్టేషన్‌కు తీసుకొ చ్చి విచారించారని, విచారణ అనంతరం అతడి తమ్ముడిని పిలిపించి అతడితో ఇంటికి పంపించారన్నారు. ఇందుకు భయపడిన రామాంజనేయులు రాచర్లలోని వైద్యశాలకు వెళ్లాడని, అక్కడ బీపీ ఎక్కువ కావడంతో గుండెపోటుకు గురై మృతి చెందాడని సీఐ వివరించారు.