రఫియా నాజ్ ఇంటిపై రాళ్ల దాడి
రాంచీ : యోగా టీచర్ రఫియా నాజ్ ఇంటిపై శనివారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆమె ఇంటి వద్ద భారీగా భద్రత పెంచారు. యోగాసనాలు వేసినందుకు గురువారం ముస్లిం కమ్యూనిటీకి చెందిన కొందరు ఆమెను బెదిరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన ఆమె.. తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
బెదిరింపుల ఉదంతంపై శనివారం ఆమె ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన కొద్దిసేపటికే రఫియా నాజ్ ఇంటిపై రాళ్ల దాడి జరగడం గమనార్హం. రఫియా ఇంటి వద్ద రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు రాళ్ల దాడికి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.