రాజీవ్ యువకిరణాల్లో భేష్
కలెృక్టరేట్ (మచిలీపట్నం),న్యూస్‌లైన్ :
ఉపాధి అవకాశాలున్న రంగాల్లో యువతకు శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించాలని రాజీవ్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ మిషన్ చైర్మన్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మంగళవారం అధికారులతో రాజీవ్ యువకిరణాలు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజీవ్ యువకిరణాలు అమల్లో జిల్లా మంచి పురోగతి సాధించిందన్నారు.
40 సంవత్సరాల్లోపు వయస్సున్న నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాజీవ్ యువకిరణాలు కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు కౌన్సెలింగ్ నిర్వహించి వారికి ఆసక్తి గల రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పనకు కృషి చేయాలన్నారు. ఐటీ రంగాల్లో యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో నైపుణ్యం ఉన్న ప్రైవేటు సంస్థల సహకారంతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ రాజీవ్ యువకిరణాలు పథకంపై ప్రతి సంవత్సరం నిరుద్యోగ యువతను గుర్తించి వారికి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అధికారులు వారి పరిధిలోని నిధులను వినియోగించుకుని ఏయే రంగాల్లో వృతి నైపుణ్యం అభివృద్ధి పరచవచ్చో ఆ దిశగా ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరు జీ రాజేంద్రప్రసాద్ , డీఆర్వో ఎల్.విజయచందర్, ఉద్యానవనశాఖ ఏడీ సుబానీ, కార్మికశాఖ సహాయ కమిషనర్ శ్రీనివాస్, డీఆర్డీఏ ఏపీడీ జ్యోతి, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.