సమస్యల స్టేషన్ !
ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజన్లో ప్రధాన జంక్షన్‌గా విజయనగరానికి పేరుంది. నిత్యం వందలాది మంది ప్రయాణాలు చేస్తుంటారు. అటు ఒడిశా, ఇటు రాయపూర్ వెళ్లాలన్నా వ్యాపారులు విజయనగరం రైల్వేస్టేషన్లోనే ట్రైన్ మారాల్సి ఉంటుంది. అందువల్లే జిల్లా వాణిజ్యకేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇటువంటి స్టేషన్లో సమస్యలు కూత పెడతున్నాయి. రిజర్వేషన్ దగ్గర నుంచి డస్ట్బిన్ల ఏర్పాటు వరకూ పలు సమస్యలతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రైల్వేస్టేషన్లో టిఫిన్, టీ, తదితర స్టాల్స్ నిర్వహకులు ఎమ్ఆర్పీకి మించి అమ్ముతున్నారని, రైళ్లలో టాయిలెట్లు సక్రమంగా లేకపోవడ ం వంటి ఫిర్యాదులున్నాయి. విజయనగరం రైల్వేస్టేషన్ లో ప్రయాణికుల సమస్యలను తెలుసుకుని, పరిష్కార మార్గాలను కనుగొనేందుకు విజయనగరం రైల్వే స్టేషన్ మేనేజర్ బి.చంద్రశేఖర రా జు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్ గా మారారు. స్టేషన్ పరిసరాలతో పాటూ, ఫ్లాట్‌ఫామ్స్, రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికులు,
పారిశుద్ధ్య కార్మికులు, రైల్వే హమాలీలు, సీనియర్ టికెట్ కలెక్టర్లను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.
రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో
ఆయన సంభాషణ ఇలా సాగింది
స్టేషన్ మేనేజర్ : నమస్తే.. నా పేరు చంద్రశేఖర రాజు. నేను రైల్వే స్టేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. మీ సమస్యలు తెలుసుకోడానికి ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మీ వద్దకు వచ్చాను.
మీ పేరేంటి ? మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు?
ప్రయాణికురాలు: నమస్తే సార్.. నా పేరు అరుణ. పండగకు ఊరొచ్చాం. మేము బెంగుళూరు వెళ్తున్నాం.
స్టేషన్ మేనేజర్: రైల్వేస్టేషన్లో మీకేమైనా సమస్యలు ఎదురయ్యాయా ? స్టేషన్‌పై మీ అభిప్రాయమేంటి ?
అరుణ: విజయనగరం రైల్వేస్టేషన్ గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గానే ఉంది. అప్పట్లో ఇరుగ్గా ఉండేది. ప్రస్తుతం విశాలంగా, సౌకర్యంగానే ఉంది. పెద్ద పెద్ద స్టేషన్లను బాగా డెవలప్ చేయాలి.
స్టేషన్ మేనేజర్ : హలో సార్... నమస్తే, మీ పేరేంటి , సమస్యలు ఏమైనా ఉన్నాయా?
రాజన్న: నాపేరు రాజన్న, స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగానే ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం గమనించాం. చెత్తా, చెదారాలు కిందపడేయకుండా మరికొన్ని డస్ట్బిన్లను ఏర్పాటుచేస్తే బావుంటుంది.
స్టేషన్ మేనేజర్ : మరో ప్రయాణికుడి దగ్గరకు వెళ్తూ... మీ దగ్గర టికెట్ ఉందా? ఆన్లైన్లో తీశారా, రిజర్వేషన్ కౌంటర్ ద్వారానా? ఈజీ టికెటింగ్ పట్ల అభిప్రాయం?
వంశీ: ఆన్లైన్లోనే టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాను. మొబైల్ టికెటింగ్ రావడం రైల్వేస్‌లో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. పని సులభంగా అయిపోతుంది. భువనేశ్వర్ వెళ్తున్నాను.
స్టేషన్ మేనేజర్: ప్రయాణికుల దగ్గర నుంచి ఎంఆర్పీని మించి అమ్ముతున్నారంట? ఇప్పుడే నా దృష్టికి వచ్చిం ది. ఏంటి విషయం ?
వెంకటరావు, వ్యాపారి: లేదు సార్... అటువంటిదేమీ లేదు.. ఎక్కడో జరిగి ఉండవచ్చు. మన స్టేషన్లో ఎంఆర్పీకే అమ్మకాలు చేస్తున్నాం.
స్టేషన్ మేనేజరు: నీ పేరేంటి, ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నావు? జీతం సక్రమంగా వస్తుందా?
పారిశుద్ధ్య కార్మికుడు: నాపేరు అప్పలరాజు సార్, నాలుగేళ్ల నుంచి కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్నాను. ఎనిమిది గంటల సమయం పనిచేస్తాను. పీఎఫ్ కట్ అవుతోంది. రూ.5వేల వరకూ జీతమిస్తారు.
ఈ లోపు బెంగుళూరు నుంచి భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రానే వచ్చింది. ఒక వ్యక్తి నడుస్తున్న రైల్లోంచి దూకడం గమనించిన స్టేషన్ మాస్టర్ ఆయన దగ్గరకు వెళ్లి
సార్ నమస్తే, అలా దూకితే ప్రమాదమని తెలీదా ? రన్నింగ్ ట్రైన్లోంచి దిగడం కరెక్ట్ కాదు గదా?
అశోక్ నాయక్ : ఆకలికి తట్టుకోలేక ఏదో తినేద్దామన్న ఆత్రుతతో గెంతేశాను. అంతేనండి. పొరపాటైంది. ఇంకెప్పుడూ ఇలా చేయను.
స్టేషన్ మేనేజర్ : రైల్వే ప్రాంగణంలో మార్కింగ్ ప్రకారం పార్కింగ్ చేస్తున్నారా? కారు, జీపు తదితర పార్కింగ్లు చేయడంలో మీకేమైనా సమస్యలు వస్తున్నాయా?
సీహెచ్ రాజా (డ్రైవర్) : లేదు సర్.. గత కొన్నాళ్లుగా ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాం. మార్కింగ్ మేరకు ఇచ్చిన స్థలంలో చక్కగానే పార్కింగ్ జరుగుతోంది. అదనపు రుసుం వసూలు చేయడం లేదు. కానీ పార్కింగ్ పక్కన ఖాళీస్థలాల్లో బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తున్నారు. దానివల్ల ఇబ్బందులు పడుతున్నాం.
స్టేషన్ మేనేజర్ : పార్కింగ్ పక్కన ఖాళీ స్థలంలో సులబ్‌కాంప్లెక్స్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది.
స్టేషన్ మేనేజర్ : ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులతో మాట్లాడుతూ.. రైలు ప్రయాణంలో ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయా? బోగీలను క్లీన్‌గా ఉంచుతున్నారా? మంచి ఆహారాన్ని అందిస్తున్నారా ?
డి.ఎస్. పాడి(ప్రయాణికుడు) : రైల్లో క్లీనింగ్ చేస్తున్నప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నవారికి కాస్త ఇబ్బందిగానే ఉంటోంది. బాత్రూమ్లు సక్రమంగా లేవు. నీటి సౌకర్యం లేదు. చెత్తా, చెదారాలు పడేస్తున్నారు. ప్రధాన రైల్వేస్టేషన్ల వద్ద క్లీనింగ్, వాటరింగ్ చేయించే విధంగా చర్యలు చేపట్టాలి.
స్టేషన్ మేనేజర్ : తప్పకుండా ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కరిస్తాం. అలా రైల్లోనే నడుస్తూ... క్యాంటిన్ బోగీలోకి వెళ్లి వండుతున్న ఆహారాపదార్థాలను పరిశీలించారు. రైస్ ఎప్పుడు వండారు? పన్నీరు ప్రెష్‌గా కనబడటం లేదు? ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంట? నిల్వ ఆహార పదార్థాలు ఇస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు ? ఏమిటి విషయం?
రాజీవ్ గుప్త ( క్యాంటిన్ కార్ నిర్వహకుడు) : రైస్ ఇప్పుడే దించాము సార్.. లంచ్ టైమ్‌కి ప్యాకింగ్ చేసేందుకు పక్కన పెట్టాం. పన్నీరు ప్రెష్దే , ఎప్పటికప్పుడు ఆర్డర్ ప్రకారమే వంట చేస్తాం. వెజ్మీల్స్, బిర్యానీ, కాఫీ, టీ అన్నీ ఐఆర్సీటీసీ ఇచ్చిన ధరల ప్రకారమే విక్రయిస్తున్నాం.
స్టేషన్ మేనేజర్ : రైలు దిగిన తర్వాత రైల్వే కూలీలతో మాట్లాడుతూ జీతం సక్రమంగా వస్తోందా? బేరాలు వస్తున్నాయా ?
లక్ష్మణరావు(హమాలీ) : ప్రయాణికులు చక్రాల బ్యాగులు వాడుతుండడంతో వారే తమతో పాటు తీసుకువెళుతున్నారు. ఇంకా మేము మోసేది ఎక్కడ సార్. ప్రభుత్వం రూ.2,415 ఇస్తుంది. అది కూడా 30 మందికే వస్తుంది. ఇంకా 140 మంది వరకూ కార్మికులు ఉన్నారు. బయట కూలికెళితే రోజుకు రూ.300 వరకూ వస్తుంది. ఇక్కడ అది కూడా రావడంలేదు. పీఎఫ్ లే దు. పిల్లాపాపలతో ఇబ్బందులు పడుతున్నాం.
స్టేషన్ మేనేజర్ : మీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాను.
స్టేషన్ మేనేజర్ : స్టేషన్లో టికెట్ చెకింగ్ ఎలా ఉంది? టికెట్ తీసే ప్రయాణాలు చేస్తున్నారా ? ఎవరైనా టికెట్లేని ప్రయాణికులు దొరికారా ?
బీరేంద్ (సీనియర్ టీసీ) : లేదు సర్.. ప్రయాణికులు టికెట్ తీస్తున్నారు.
స్టేషన్ మేనేజర్ : రైల్వే రిజర్వేషన్ కౌంటర్లోకి వెళ్తూ... స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరూ చేయాలంటూ పారిశుద్ధ్య కార్మికురాలికి సూచించారు. అనంతరం ఆమె దగ్గర ఉన్న చీపురును తీసుకుని రిజర్వేషన్ కౌంటర్లో ఒక భాగాన్ని పరిశుభ్రం చేశారు. అనంతరం ఆమెతో మాట్లాడుతూ సక్రమంగా జీతాలు వస్తున్నాయా ? ఫినాయిల్, బ్లీచింగ్ తదితర వాటిని సక్రమంగా అందజేస్తున్నారా ?
లక్ష్మి (పారిశుద్ధ్య కార్మికురాలు): పారిశుద్ధ్య కార్మికులంతా ఒకరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాం. రిజర్వేషన్ కౌంటర్లో ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే చెత్తా,చెదారాలు పేరుకుపోతుంటాయి. అందుకే నిత్యం ఒకరు పనిచేస్తూనే ఉంటాం సార్.. ఫినాయిల్, బ్లీచింగ్ తదితర సామాగ్రిని సక్రమంగానే అందజేస్తున్నారు సర్.