టీటీఐ వేషంలో ప్రయాణికులకు టోకరా
* ఇద్దరు కేటుగాళ్ల రిమాండ్
* జువైనల్ హోమ్‌కు బాలుడి తరలింపు
సికింద్రాబాద్: రైల్వే టీటీఐల వేషంలో బెర్త్‌లు కన్ఫామ్ చేయిస్తామని ప్రయాణికుల నుంచి డబ్బు దండుకోవడంతో పాటు లగేజీ ఎత్తుకెళ్తున్న ఇద్దరు కేటుగాళ్లను గోపాలపురం పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. బీహార్‌కు చెందిన వీరిద్దరికీ సహకరిస్తున్న ఓ బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.
డిటెక్టివ్ ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం....గచ్చిబౌలికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రశాంత్ పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో పాట్నా వెళ్లేందుకు ఈనెల 22న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. అయితే అతను కొనుగోలు చేసిన ఆన్లైన్ టికెట్‌పై బెర్త్ కన్ఫామ్ కాకపోవడంతో జనరల్ టికెట్ కొనుగోలు చేసేందుకు కౌంటర్ వద్ద నిలబడ్డాడు. ఇది గమనించిన ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. తనకు తెలిసిన టీటీఐ ఉన్నాడని, టికెట్ కంటే ఎక్కువ డబ్బు చెల్లిస్తే స్పాట్లో బెర్త్ కన్ఫామ్ చేయిస్తాడని నమ్మబలికి రైల్వేరిజర్వేషన్ కార్యాలయం వద్దకు తీసుకెళ్లాడు.
అక్కడ టీటీఐ యూనిఫామ్ ధరించి ఉన్న ఓ వ్యక్తిని పరిచయం చేశాడు. టీటీఐ డ్రస్‌లో ఉన్న అతను లగేజీని బయటే పెట్టించి, ప్రశాంత్ ఒక్కడినే రిజర్వేషన్ కార్యాలయంలోకి తీసుకెళ్లి రిజర్వేషన్ ఫామ్ పూరించి, టికెట్ డబ్బు, అదనపు డబ్బు తీసుకున్నాడు. కొద్దిసేపు ఎవరికో ఫోన్ చేస్తున్నట్టు నటించాడు. తర్వాత మేనేజర్‌ను కలిసి వస్తానని చెప్పి లోపలికి వెళ్లిన నకిలీ టీటీఐ వెనుకవైపు ద్వారం గుండా బయటకు ఉడాయించాడు. సమయం గడపిచిపోతున్నా టికెట్ ఇప్పిస్తానన్న వ్యక్తి కనిపించకపోవడంతో ప్రశాంత్ రిజర్వేషన్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి చూడగా... లగేజీతో పాటు తనను అక్కడికి తీసుకొచ్చిన వ్యక్తి కనిపించలేదు.
దీంతో తాను మోసపోయానని గ్రహించిన ప్రశాంత్ గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ పుటేజీల ద్వారా నిందితులను గుర్తించిన గోపాలపురం పోలీసులు రెండ్రోజులుగా రైల్వేస్టేషన్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించగా ఆ కేటుగాళ్లు కనిపించారు. నిందితుల్లో ఒకడు టీటీఐ యూనిఫామ్ ధరించి ఉన్నాడు. పోలీసులు నిందితుల నుంచి టీటీఐ యూనిఫామ్‌తో పాటు, రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు సహకరిస్తున్న ఓ బాలుడిని పట్టుకొని జువైనల్ హోమ్‌కు తరలించారు.