Rajamahendravaram Govt hospital
-
ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు
కడియం: కుటుంబ కలహాలు ముగ్గురి ప్రాణాలు బలిగొన్నాయి. ఇంట్లో ఒకే గదిలో నిద్రిస్తున్న ఆరుగురిపై మేనల్లుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్లలో మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో చోటు చేసుకుంది. పెట్రోల్ పోసి నిప్పంటించాక, బయట తలుపునకు గొళ్లెం పెట్టేయడంతో ఒకే గదిలో ఉన్న వీరంతా బయటకు రాలేకపోయారు. తల్లి కోట్ని సత్యవతి (50), ఆమె కుమారుడు కోట్ని రాము (18), మనుమరాలు గంటా విజయలక్ష్మి (8) మృతి చెందారు. సత్యవతి కుమార్తె దుర్గాభవానీ, మనుమలు దుర్గామహేష్, ఏసుకుమార్ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దుర్గాభవానీకి 90 శాతానికి పైగా కాలిన గాయాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మృతురాలు సత్యవతి భర్త అప్పారావు చెల్లెలి కొడుకు మాసాడ శ్రీను ఈ ఘటనకు బాధ్యుడిగా పోలీసులు భావిస్తున్నారు. మేనమామ కూతురినిచ్చి వివాహం చేస్తానని చెప్పి, అతడి వద్ద నుంచి ఆర్థిక సాయాన్ని పొందినట్టుగా చెబుతున్నారు. అయితే వివాహం చేయలేదు. మూడేళ్ల కిందట వేర్వేరు వివాహాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాను ఇచ్చిన డబ్బును తిరిగిచ్చేయాలని శ్రీను కొద్దిరోజులుగా మేనమామ కుటుంబంతో గొడవకు దిగుతున్నాడు. ఆరేళ్ల నుంచి ఈ ఘర్షణ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 17న పోలీసు కేసు కూడా నమోదైంది. కేసు విచారణలో ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, మంటల తీవ్రతకు వీరు అద్దెకు ఉంటున్న పెంకుటింటికి నిప్పంటుకుని కాలిపోయింది. రాయవరంలో జరుగుతున్న తీర్థానికి వెళ్తున్న కొందరు యువకులు ఇల్లు కాలుతుండడాన్ని గమనించి తలుపు గొళ్లెం తొలగించి గదిలో ఉన్నవారిని, పక్కగదిలోనే ఉంటున్న ఇంటి యజమాని కానూరి రామాయమ్మను బయటకు తీసుకొచ్చారు. బాధితులను అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కాగా, ఘటన జరిగిన సమయంలో అప్పారావు ఇంట్లో లేరు. వాచ్‌మెన్‌గా పని చేస్తున్న ఆయన నైట్ డ్యూటీకి వెళ్లారు. -
అన్నీ సం‘దేహా’లే..!
తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం క్రైం: బోటు ప్రమాదంలో గల్లంతైన వారి మృతదేహాల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో బంధువులు ఎదురు చూస్తున్నారు. వాడపల్లి వద్ద మంగళవారం లభించిన పురుషుడి మృతదేహం ఎవరిదనేది తేల్చేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తనమూనాలు సేకరించారు. బోటు ప్రమాదంలో గల్లంతైన కాకినాడ సర్పవరం జంక్షన్‌కు చెందిన బోటు డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ(60) మృతదేహంగా అతడి కుమారుడు పోతాబత్తుల కుమార్ అంటుండగా, ఇదే బోటు ప్రమాదంలో గల్లంతైన బోటు సహాయకుడు పశ్చిమగోదావరి జిల్లా పాత పట్టిసీమకు చెందిన కర్రి మణికంఠ(24)దిగా అతడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహం నుంచి రక్త నమూనాలు సేకరించారు. వీటిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించి రిపోర్టు ఆధారంగా మృతదేహం సంబంధిత వ్యక్తులకు అప్పగించే ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయాధికారి టి.రమేష్ కిషోర్ తెలిపారు. మృతదేహాల కోసం ఎదురుచూపులు బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వారి కుటుంబసభ్యులు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన అంకం పవన్ కుమార్, అతడి భార్య అంకం వసుంధరా భవానీ మృతదేహాల కోసం పవన్ కుమార్ మేనమామ రాజేంద్ర ప్రసాద్ ఎదురు చూస్తున్నారు. ఇతడిని రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి పిలిచి మృతదేహాల జాడ తెలిస్తే మీకు సమాచారం అందిస్తామని, మీరు వెళ్లవచ్చని అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మృతదేహాల ఆచూకీ లభించే వరకూ ఇక్కడ నుంచి వెళ్లే ప్రసక్తే లేదని అధికారుల వద్ద అన్నారు. బోటు డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ కోసం అతడి తల్లి పోతాబత్తుల వెంకాయమ్మ, కుమారుడు పోతాబత్తుల కుమార్, ఇతర బంధువులు ఎదురు చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాత పట్టిసీమకు చెందిన కర్రి మణికంఠ మృతదేహం కోసం అతడి తండ్రి కర్రి నరసింహరావు, తల్లి పద్మావతి, సోదరి ఎదురు చూస్తున్నారు. రక్త నమూనాల సేకరణపై స్పష్టత ఇవ్వని అధికారులు వాడపల్లి వద్ద లభించిన మృతదేహం కోసం రెండు కుటుంబాల నుంచి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు బంధువుల రక్త నమూనాలు సేకరిస్తామని బుధవారం సాయంత్రం పోలీసులు బాధిత కుటుంబాలకు తెలిపారు. గురువారం ఉదయం తొమ్మిది గంటకు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉండాలని సూచించారు. గురువారం ఉదయం తొమ్మిది గంటల్లోపే బాధిత కుటుంబాలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నా వీరి రక్త నమూనాలు సేకరించలేదు. పైగా వీరికి సమయానికి రావాలని చెప్పిన అధికారులు సైతం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కనిపించకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలవరం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి, ఎఫ్ఐఆర్ తీసుకు వస్తే విజయవాడలో రక్తసంబంధీకుల రక్త నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలకు పంపిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మూడు గుర్తు తెలియని మృతదేహలు ఇప్పటికే డీ కంపోజైన దృష్ట్యా వాటికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని రోజులు మృతదేహాలు భద్రపరిస్తే వాటి వల్ల ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వాటి నుంచి రక్త నమూనాలు సేకరించి భద్రపరుస్తున్నారు. -
అధైర్యపడకండి అండగా ఉంటాం
సాక్షి ప్రతినిధి బృందం, రాజమహేంద్రవరం: బోటు ప్రమాదం నుంచి బయటపడి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. 21 మంది బాధితులు, వారి కుటుంబ సభ్యులకు తానున్నానని భరోసా ఇచ్చారు. ఒక్కో బాధితుడి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరు, ఆసుపత్రిలో అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన కొంత మంది సీఎం జగన్‌ను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చి ధైర్యంగా ఉండాలని చెప్పారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇళ్లకు పంపాలని మంత్రులకు సూచించారు. ఆస్పత్రిలో ఒక్కొక్కరినీ పలకరిస్తున్న సమయంలో వారి హృదయాల్లో నుంచి వస్తున్న ఆవేదనను చూసి సీఎం భావోద్వేగానికి గురయ్యారు. ధైర్యంగా ఉండమ్మా.. భర్త, కుమార్తెను కోల్పోయిన తిరుపతికి చెందిన మధులతను పలకరించిన సందర్భంలో ఆమె పరిస్థితిని చూసి చలించిపోయారు. కొద్దిసేపు అలానే ఉండిపోయారు. ‘భర్త, కూతుర్ని కోల్పోయి అనాథనయ్యాను. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. కాలు కింద పెట్టకుండా పెంచుకున్నాను. నేను చనిపోతే నాకు ఎవరు తలకొరివి పెడతారని అడిగితే అమ్మా.. జగనన్నకు ఉన్నది కూడా ఇద్దరు కుమార్తెలు.. వాళ్లలాగనే నేనూ చూసుకుంటానని చెప్పింది. స్కూల్లో, అల్లరిలో ఫస్ట్. నాకు బతకాలని కూడా లేదు. కనీసం నా భర్తను, చిన్నారిని ఒక్కసారి కడసారి చూపు చూపించన్నా..’ అంటూ మధులత గద్గద స్వరంతో సీఎంను పట్టుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. ‘మీరొస్తూనే కరప్షన్ కనపడదని చెప్పారన్నా.. పోలీసులను వదలకండి.. మూడు నాలుగు వేలకు కక్కుర్తిపడి పోలీస్‌స్టేషన్ వద్ద ఆపిన బోటును మళ్లీ పంపించేశారు. మరొకరికి ఈ పరిస్థితి రాకూడదన్నా.. ఎన్ని కుటుంబాలు నడిరోడ్డున పడ్డాయో చూస్తున్నారు కదన్నా..’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెను పరామర్శించిన సీఎం.. ధైర్యంగా ఉండాలంటూ సముదాయించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మీరు ఎక్కింది ఏ బోటు? ‘మీరు ప్రయాణించింది ఏపీ టూరిజం బోటా, ప్రైవేటు బోటా’ అని సీఎం జగన్.. ప్రాణాలతో బయటపడిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో పని చేస్తున్న నలుగురు ఏఈలు సాలేటి రాజేష్, శివ శంకర్, నార్లపురం సురేష్, మేడి కిరణ్ కుమార్‌లను ప్రశ్నించారు. ‘ప్రభుత్వ టూరిజం బోట్లు తిరగడం లేదని వెబ్సైట్ చూస్తే తెలిసింది. ప్రభుత్వ వెబ్సైట్లో డేంజర్ అని చూపించింది. దీంతో బోటు నిర్వాహకులను పర్యటనకు రావచ్చా.. అని అడిగాం. వరద తగ్గిపోయింది ఇబ్బంది లేదని చెప్పడంతో బయలుదేరి వచ్చాం. తీరా ఇక్కడ ఇలా జరుగుతుందని అనుకోలేదన్నా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇది ప్రైవేటు బోటు.. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఇంత మంది ప్రాణాలు పోయాయన్నా.. అని శివశంకర్ కన్నీటిపర్యంతమయ్యాడు. మీరు గట్టి నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నా.. అని విన్నవించాడు. ఆరోగ్యం ఎలా ఉంది? వరంగల్ జిల్లా కడిపి కొండకు చెందిన బసికె దశరథు వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును బాధితుడు ముఖ్యమంత్రికి వివరించారు. ఆస్పత్రిలో అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలంటూ సూచించారు. వరంగల్ జిల్లా కడిపికొండ గ్రామానికి చెందిన దర్శనాల సురేష్‌ను సీఎం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటన నుంచి తేరుకొని ధైర్యంగా ఉండాలని సూచించారు. ఇదే గ్రామానికి చెందిన గొర్రె ప్రభాకర్‌నూ సీఎం పరామర్శించి.. బోటులో ఎంత మంది ప్రయాణించారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. కడిపికొండ గ్రామానికి చెందిన బసికె వెంకట స్వామి, యాదగిరిలు సీఎంకు సంఘటన గురించి వివరిస్తూ.. తాము 14 మందిమి బోటులో వెళ్లగా ఐదుగురం బయటపడ్డామని, ఇద్దరి మృతదేహాలు లభించాయని, మరో ఏడుగురి ఆచూకీ తెలియలేదని వివరించారు. త్వరలోనే అన్ని మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని సీఎం పేర్కొన్నారు. మా వాళ్ల ఆచూకీ తెలపండి సార్.. హైదరాబాద్ హయత్ నగర్‌కు చెందిన కె.అర్జున్, జర్నికుమార్లను పరామర్శించిన సీఎం జగన్‌ను చూసి అర్జున్ తండ్రి బోరున విలపించారు. ఈ ప్రమాదంలో తమ బిడ్డలు భరత్ కుమార్, విశాల్ గల్లంతయ్యారని తెలిపారు. త్వరలోనే వారి ఆచూకీ లభిస్తుందని, ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన సి.హెచ్ జానకి రామారావుతో ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తనతో పాటు భార్య శివజ్యోతి, బావ పవన్ కుమార్, సోదరి వసుంధర, వారి కుమారుడు సుశీల్‌లు బోటులో ప్రయాణించామని, ఇప్పుడు తానొక్కడినే మిగిలానని కన్నీటిపర్యంతమయ్యారు. వారి ఆచూకీ త్వరగా కనుక్కోవాలని కోరారు. కాగా, ప్రమాద స్థలిలో ఏరియల్ సర్వే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరామర్శ, సహాయ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి 3.20 గంటలకు తాడేపల్లి చేరుకున్నారు. -
ఆస్పత్రిలో వద్దన్నారు..ఆటోలోనే ప్రసవించింది!
రాజమహేంద్రవరం: ఆమె పేరు రాములమ్మ(25). నిండు గర్భిణి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఈమె శనివారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోలో వెళ్లింది. ఒంట్లో నలతగా ఉందని, కాన్పు వచ్చేలా ఉందని ఆస్పత్రి సిబ్బందికి చెప్పుకుంది. కానీ, వారు ఆమె మాటలను లక్ష్యపెట్టలేదు. 'ప్రసవానికి ఇంకా ఇరవై రోజుల సమయం ఉందిలే.. వెళ్లిపో..' అంటూ వెనక్కి పంపేశారు. ఇబ్బంది పడుతూనే తిరిగి ఆటో ఎక్కిన రాములమ్మ ఒక్కసారిగా కూలబడిపోయింది. ఆటోలోనే బిడ్డను ప్రసవించింది. ఆస్పత్రి ఆవరణలోనే ఇంత జరుగుతున్నా పట్టించుకోని సిబ్బందిపై అక్కడున్న జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మేలుకున్న సిబ్బంది.. తల్లితోపాటు శిశువును లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.