కూటమి ఎమ్మెల్యే.. అక్రమ డబ్బు లెక్కలకు మిషన్లు కొన్నారట: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరు అనే పోటీ పెడితే ఆదిరెడ్డి వాసునే మొదటి స్థానంలో ఉంటాడని ఆరోపించారు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే రెండు కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. అలాగే, ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టలేక ఆదిరెడ్డి మూడు కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారట అని వ్యాఖ్యలు చేశారు.రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాత్యహంకార ధోరణి చూపించింది. రాజమండ్రిలో దళిత యువకుడుపై జరిగిన ఘటనపై ఢిల్లీలో ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశాం. జనవరి మూడో వారంలో కమిషన్ ఏపీకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశారు.సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన బీసీ మంత్రులు మూడుసార్లు క్షమాపణ చెప్పాల్సి రావడం దారుణం. సామాజిక కార్యక్రమాలకు అన్ని పార్టీల నాయకులు హాజరుకావడం పరిపాటి. బీసీ నాయకులపై జాతి దురహంకారం చూపిస్తున్నారా?. కమ్మ గ్లోబల్ సమిట్లో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. అప్పుడు ఎందుకు అడ్డు చెప్పలేదు?. బీసీల పట్ల కూటమి ప్రభుత్వం అణుగదొక్కే వైఖరి అవలంబిస్తోంది.కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలో ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దందాల లిస్ట్ లెక్కలేనంత ఉంది. కోటిలింగాల ఘాట్ నుండి ఫోర్త్ బ్రిడ్జి వరకు ఉన్న 15 ర్యాంపుల్లో డ్రెడ్జింగ్ చేసి 800 లారీలు ప్రతిరోజు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే మామూలు వసూలు అవుతోంది. లారీకి రూ.8500 తీసుకుంటున్నారు. స్థానిక ఈవీఎం ఎమ్మెల్యేకు రోజుకు ఈ ర్యాంపుల ద్వారా 24 లక్షలు రూపాయలు ఆదాయం వస్తోంది. ఆనంద నగర్ క్వారీ ప్రాంతాల్లో పేకాట క్లబ్బుల కూడా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతోనే నిర్వహిస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో భూకబ్జాలు గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఎమ్మెల్యే వెనకాలే తిరిగే వ్యక్తులు అనేక చోట్ల భూకబ్జాలకు పాల్పడ్డారు.ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టలేక స్థానిక ఎమ్మెల్యే మూడు కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారట. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే అతిపెద్ద స్లాటర్ హౌస్ ఉంది. రోజుకు రెండు మూడు వందల గోవులు అక్కడ హతమైపోతున్నాయి. వాటి నిర్వాహకుడు రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడే. దమ్ముంటే ఇప్పుడున్న పదవులకు రాజీనామా చేసి పేపర్ బ్యాలెట్తో పోటీకి రండి. నేను సవాల్ విసురుతున్నాను. డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ వద్ద కూడా ఎమ్మెల్యే రెండు కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి అని కామెంట్స్ చేశారు.