సీమకు తరతరాలుగా అన్యాయం: బెరైడ్డి
న్యూఢిల్లీ: తరతరాలుగా త్యాగాలు చేస్తున్న సీమ ప్రజలకు చివరకు అన్యాయమే జరుగుతోందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం ఇక్కడ నిర్వహించిన జలసాధన దీక్షలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాల కళ్లు తెరిపించేందుకు ఈ దీక్ష చేపడుతున్నట్టు వివరించారు. ‘కృష్ణా పెన్నా ప్రాజెక్టు కట్టుకోలేకపోయాం. దాని స్థానంలో నాగార్జునసాగర్ కట్టుకున్నారు.
లక్షల ఎకరాలకు నీరందించే సర్ మెకన్జీ పథకాన్ని తుంగలో తొక్కారు. ఎగువన అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల పైన నీళ్లున్నా సీమకు కరువే మిగులుతోంది. రాజధాని , నీళ్ల విషయంలో తీవ్రమైన అన్యాయం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వానికి కూడా పొద్దున లేచిన నుంచి అమరావతి, మెట్రో రైలు, కృష్ణా డెల్టా తప్ప ఇంకొకటి కనిపించడం లేదు’ అని పేర్కొన్నారు. డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లు తీసుకుపోతున్నారు తప్ప సీమకు నీళ్లివ్వడం లేదన్నారు.