పాప మృతికి కారణం ఆమె తండ్రే
రాజస్తాన్ యాక్సిడెంట్‌పై నటి, ఎంపీ హేమమాలిని వివాదాస్పద ట్వీట్
ముంబై: రాజస్తాన్‌లో ప్రమాదంపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని తాజా ట్వీట్ వివాదాస్పదమైంది. ‘బాలిక తండ్రి ట్రాఫిక్ రూల్స్ పాటించి ఉంటే ఆ చిన్నారి ప్రాణం పోయేది కాదు’ అని ఆమె ట్విటర్లో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో హేమ ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొనడంతో నాలుగేళ్ల బాలిక మృత్యువాత పడటమే గాక హేమ, మరో నలుగురు గాయపడ్డం తెలిసిందే.
హేమ మెర్సిడెజ్ బెంజ్ తన ఆల్టో కారును ఢీకొన్నప్పుడు అది గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళుతోందని మృతురాలి తండ్రి హనుమాన్ మహాజన్ ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన హేమ ట్వీట్‌పై స్పందిస్తూ ‘పెద్దవాళ్లు ఏదైనా మాట్లాడగలరు. ఆమెకు ధైర్యముంటే నా ముందుకొచ్చి చెప్పమనండి’ అని అన్నారు.
మీడియాను తప్పుబట్టిన హేమ
మృతురాలి కుటుంబీకుల్ని వదలి ఒంటరిగా వెళ్లిపోయిన తనపై మీడియా విమర్శలు గుప్పించడం పట్ల ట్వీటర్లో హేమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘సంచలనాల కోసమే మీడియా నన్ను అపఖ్యాతి పాలు చేసింది’ అని అన్నారు. కాగా హేమమాలిని కారు ప్రమాద ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాజస్తాన్ రాష్ట్ర మానవ హక్కుల సంఘం అక్కడి పోలీసులు, స్థానిక అధికారులకు నోటీసులు జారీ చేసింది.