22న బీజేపీ ‘మహా గర్జన’
ముంబై: రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 22న ముంబైలో ‘మహా గర్జన’ ర్యాలీ నిర్వహించనున్నామని పార్టీ అధికారి ఒకరు శనివారం తెలిపారు. ఈ మెగా ర్యాలీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ, నాయకులు గోపీనాథ్ ముండే, ఏక్నాథ్ ఖడ్సే, వినోద్ తావ్డేతో పాటు పలువరు ప్రముఖులు హాజరవుతారని చెప్పారు.
ఈ ర్యాలీ సన్నద్ధత ఏర్పాట్ల గురించి రాష్ట్ర బీజేపీ ఆఫీస్ బేరర్లతో పార్టీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్ రూడీ చర్చలు జరిపారు. ఇతర బహిరంగ సభల కన్నా అందరికీ ఆదర్శంగా నిలిచేలా ర్యాలీ ఏర్పాట్లు ఉండాలని, ఇందుకోసం అదనపు చర్యలు తీసుకోవాలని ఆఫీస్ బేరర్లందరిని కోరామని రూడీ చెప్పారు. ఈ ర్యాలీకి గ్రామీణ ప్రజలు హాజరయ్యేలా చూడాలని, ఈ మేరకు కిందిస్థాయి కార్యకర్తలు పాటుపడాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవీంద్ర ఫడ్నవిస్ తెలిపారు. ప్రజలు సాధ్యమైనంత మేర ఎక్కువ హాజరయ్యేందుకోసం వివిధ మీడియా సాధనాల ద్వారా ప్రచారం చేయాలని నగర పార్టీ అధ్యక్షుడు అశీష్ శెలార్ కోరారు. ర్యాలీ వేదిక ఎక్కడుంటుందనే తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.