rajiv ratan
-
Telangana: డీజీపీ రేసులో పోటాపోటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త పోలీస్ బాస్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోలీస్ విభాగాధిపతిగా ఎవరు వస్తారన్న చర్చ పోలీస్ వర్గాల్లో జోరందుకుంది. ప్రస్తుత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఈనెల 31న పదవీ విరమణ పొందనున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని కొత్త డీజీపీగా నియమించనుందనే విషయానికి మరో వారంలో తెరపడనుంది. హెచ్ఓపీఎఫ్ (హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్) డీజీపీ రేసులో ఏసీబీ డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రేసులో మాత్రం వీరి ముగ్గురితోపాటు మరో సీనియర్ ఐపీఎస్ రాజీవ్‌రతన్ సైతం ఉన్నట్టు సమాచారం. డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డితోపాటు ప్రస్తుతం సీనియార్టీ ప్రకారం డీజీపీ ర్యాంకులో 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఉమేశ్ షరాఫ్, 1990 బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్, రవిగుప్తా ఉన్నారు. సీఐడీ డీజీగా పనిచేసిన మరో సీనియర్ ఐపీఎస్ గోవింద్‌సింగ్ గత నెలలో పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌రతన్‌కు డీజీ ర్యాంకు దక్కనుంది. అయితే, అందరిలోకి సీనియర్ అయిన ఉమేశ్ షరాఫ్ పదవీ కాలం 2023 జూన్‌తో ముగియనుంది. కేవలం ఆరు నెలల కాలమే ఉన్నందున ఆయనకు అవకాశాలు తక్కువే అన్న అభిప్రాయాలు పోలీస్ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉండగా, గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేసిన వారికి డీజీపీగా పదోన్నతి లభించింది. తెలంగాణ తొలి డీజీపీ అనురాగ్‌శర్మ, ప్రస్తుత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి విషయంలోనూ ఇదే మాదిరి జరిగింది. వారిద్దరు సైతం హైదరాబాద్ సీపీగా పనిచేస్తూ డీజీపీగా పదోన్నతి పొందారు. ఆ లెక్కన డీజీపీ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో అంజనీకుమార్ గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేయగా, సీవీ ఆనంద్ ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నారు. ఎక్స్‌కేడర్ కోటాలో సీవీ ఆనంద్‌కు పదోన్నతి? సీఐడీ డీజీగా పనిచేసి ఇటీవల రిటైరైన గోవింద్ సింగ్ స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్‌కు డీజీ ర్యాంకులో పదోన్నతి దక్కింది. అయితే ప్రభుత్వం ఎక్స్‌కేడర్ కోటా కింద ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారులకు ఒకే హోదా ఉండేందుకు వీలుగా డీజీ పోస్టు సృష్టించి పదోన్నతి కల్పించవచ్చు. అలా సీవీ ఆనంద్ అడిషనల్ డీజీ ర్యాంకు నుంచి డీజీ ర్యాంకుకు పదోన్నతి పొందుతారు. లేదంటే ఈనెల 31న పదవీ విరమణ పొందనున్న మహేందర్‌రెడ్డి స్థానంలో సీవీ ఆనంద్‌కు డీజీ హోదా దక్కే అవకాశముంది. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రవిగుప్తా పేరు సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని అదనపు డీజీపీ ర్యాంకులో ఉన్న వారిని సైతం డీజీపీ పోస్టులో నియమించే వెసులుబాటు ఉంది. దీని ప్రకారం 1992 బ్యాచ్‌కు చెందిన జితేందర్ (ప్రస్తుతం శాంతి భద్రతల అడిషనల్ డీజీ) సైతం డీజీపీ రేసులో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమేశ్ షరాఫ్ (1989), అంజనీకుమార్ (1990), రవిగుప్తా (1990), రాజీవ్ రతన్ (1991), సీవీ ఆనంద్ (1991) పేర్లు యూపీఎస్సీ సెలెక్షన్ కమిటీకి పంపినట్టు సమాచారం. ఇందులోంచి కేంద్రం ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేస్తే వారిలో ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనున్నారు. లేదంటే ముందుగా ఒకరిని ఇంచార్జి డీజీపీగా నియమించి, తర్వాత పూర్తిస్థాయి డీజీపీని నియమించే అవకాశం ఉన్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. (క్లిక్ చేయండి: అదే జరిగితే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను కోల్పోక తప్పదా?!) -
అగ్ని ప్రమాదాలు పెరిగాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది అగ్నిప్రమాదాల సంఖ్య పెరిగినట్టు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ వెల్లడించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, అగ్నిమాపక శాఖ వార్షిక నివేదిక విడుదల చేశారు. 2016లో 9,286 అగ్నిప్రమాదాలు జరిగితే ఈ ఏడాది 9,811 ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. గతేడాది కంటే 5.3 శాతం అధికంగా ప్రమాదాలు సంభవించాయని తెలిపారు. 499 మంది ప్రాణాలను తమ సిబ్బంది కాపాడారన్నారు. ఈ ఏడాది ప్రమాదా ల్లో రూ.154 కోట్ల ఆస్తినష్టం జరిగిందని, రూ.685 కోట్ల ఆస్తిని కాపాడామని రాజీవ్‌రతన్ తెలిపారు. అగ్నిప్రమాదాల నివారణపై అవగాహనకు మూడు, ఎనిమిదో తరగతుల సిలబస్‌లో పాఠ్యాంశాలను చేర్చినట్టు చెప్పారు. ఘటనాస్థలికి ఫైరింజన్లు చేరుకోవడానికి గ్రీన్‌చానల్ ఏర్పాటు చేశామని, ప్రమాదం జరిగిన వెంటనే క్షణాల్లో ప్రభుత్వ విభాగాలకు సమాచారం చేరుతోందన్నారు. గ్రీన్‌చానల్ వల్ల హైదరాబాద్ పోలీస్, వాటర్‌బోర్డు, జీహెచ్ఎంసీ, హెల్త్ విభాగాలు తక్షణమే స్పందిస్తున్నాయని చెప్పారు. ప్రాణాలకు తెగించి పనిచేసిన ఫైర్‌మెన్ అర్జున్, సుధాకర్‌కు రాష్ట్రపతి అవార్డులు సైతం వచ్చాయన్నారు. సులువుగా ఫైర్ ఎన్వోసీ పొందేందుకు ఆన్లైన్ ద్వారా అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది 5 వేలకుపైగా అనుమతులిచ్చామని, వీటి ద్వారా రూ.14.46 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో 18 అగ్నిమాపక స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కాగా, ముంబై పబ్‌లో జరిగిన అగ్నిప్రమాదం వంటి ఘటనల నివారణపై డీజీని మీడియా ప్రశ్నించగా, పబ్‌లతో తమకు సంబంధంలేదని, తాము భవనాలకు మాత్రమే ఫైర్ ఎన్వోసీ ఇస్తామని స్పష్టం చేశారు. పబ్‌లకు పోలీస్, ఎక్సైజ్ విభాగాలు అనుమతిస్తాయన్నారు. పబ్ నిర్వాహకులు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
24 మందికి స్థానచలనం, ప్రమోషన్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. పలువురికి ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు మొత్తం 24 మందికి స్థానచలనం కల్పించింది. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు మొదలు జిల్లా ఎస్పీల వరకు మార్పుచేర్పులు చేసింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం సాయంత్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర శాంతి భద్రతల అడిషనల్ డీజీగా అంజనీకుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నగర శాంతి భద్రతల అడిషనల్ కమిషనర్‌గా ఉన్నారు. ప్రస్తుతం అడిషనల్ డీజీలుగా ఉన్న సుదీప్ లక్టాకియా, తేజ్‌దీప్ కౌర్‌లకు డీజీగా పదోన్నతి కల్పించి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చింది. ఐజీగా ఉన్న రాజీవ్ రతన్‌కు అదనపు డీజీగా పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం ఐజీ హోదాలో సైబరాబాద్ కమిషర్‌గా ఉన్న సీవీ ఆనంద్‌ను అదే స్థానంలో కొనసాగిస్తూ అడిషనల్ డీజీగా ప్రమోషన్ కల్పించింది. డీఐజీలు ఆర్బి నాయక్, టి.మురళీకృష్ణ, ఎం.శివప్రసాద్‌కు ఐజీలుగా, ఎస్పీలుగా ఉన్న రాజేశ్‌కుమార్, ఎన్.శివశంకర్‌రెడ్డిలకు డీఐజీలుగా పదోన్నతి కల్పించింది. డ్రగ్స్ కంట్రోల్ డెరైక్టర్‌గా ఉన్న డాక్టర్ అకున్ సబర్వాల్‌ను హైదరాబాద్ రేంజ్ డీఐజీగా నియమించింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డెరైక్టర్‌గా ఆయనకు ఉన్న అదనపు బాధ్యతలను తొలగించింది. మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం అక్కడ ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ ఈ జిల్లా ఎస్పీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. హైదరాబాద్ ఎస్.బి.జాయింట్ కమిషనర్‌గా ఉన్న వై.నాగిరెడ్డికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. -
'రాహుల్ ప్రధాని అవుతారు'
అనంతపురం : ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ ఎన్నిక సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీలు గుప్పించి.... అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను ఆయన విస్మరించి నిరుద్యోగ యువతను దగా చేశారని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ రతన్ ఆరోపించారు. అనంత జిల్లాలో ఈ నెల 24న జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాదయాత్ర సందర్భంగా బుధవారం రాజీవ్ రతన్ అనంతపురం విచ్చేశారు. ఈ సందర్భంగా నగరంలోని డీసీసీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని టీడీపీ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా పేదలను ఉన్నత విద్యకు దూరం చేశారంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రైతులు, పేదల కష్టాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రైతు భరోసా యాత్ర చేపట్టారని వివరించారు. రాహుల్ ప్రధానమంత్రి అవుతారని... దాంతో దేశంలో అన్ని వర్గాల వారి కష్టాలు తొలగిపోతాయని రాజీవ్ రతన్ జోస్యం చెప్పారు. రాహల్ గాంధీ అనంత జిల్లాలో నిర్వహించే పాదయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎన్ఎస్యూఐ శ్రేణులు భారీగా తరలి వస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ, ఎన్ఎస్యూఐ నాయకులు లోకేశ్, శివశంకర్ తదితరులు పాల్గొనారు.