లావణ్య ప్రేమకథ
‘పిల్ల జమీందార్, పెద్దరికం, భైరవ ద్వీపం, సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రాల గీత రచయితగా సుపరిచితుడైన డా. వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో తెర కెక్కనున్న చిత్రం ‘లావణ్య విత్ లవ్బాయ్స్’. రాజ్యలక్ష్మి.సి, నర్సిమ్లూ పటేల్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి కెమెరా స్విచ్చాన్ చేయగా, ‘సిరిసిల్ల తల్లిగారు.. సిద్దిపేట అత్తగారు.. కట్టుకున్న పోరగాడు.. నప్పతట్ల నారిగాడు.. అందమంత ఏం జేత్తురో?..’ అనే పల్లవితో సాగే పాటను యశోకృష్ణ సంగీత దర్శకత్వంలో రికార్డ్ చేశారు.
వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ– ‘‘కాలేజీ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుంది. ఒక అమ్మాయి, ముగ్గురబ్బాయిల మధ్య కొనసాగే హాస్యరస ప్రేమకథా చిత్రమిది. రియల్ లవ్ అంటే ఏంటో చెబుతాం. ఫిబ్రవరి 9న చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి మురళీమోహన్, కెమెరామన్ తోట రమణ, నిర్మాత సంగిశెట్టి దశరథ పాల్గొన్నారు.