అక్కడంతా ముత్యాలయ్యలే!
జాతీయ రహదారి 44కు ఆనుకుని ఉన్న ఆ గ్రామంలో ముత్యాలయ్య.. సుంకులమ్మ పేర్లతోనే అత్యధికులు నివసిస్తున్నారు. గ్రామ దేవతలపై ఉన్న భక్తిభావంతో ఆ పేర్లను పుట్టిన పిల్లలకు పెట్టడం ఆనవాయితీగా వచ్చింది. దీంతో ఒకే ఇంటిలో ముగ్గురు.. నలుగురికి ఇవే పేర్లు ఉంటున్నాయి. ఇంతటి ప్రత్యేకత ఉన్న ఆ గ్రామం ఎక్కడని ఆలోచిస్తున్నారా? అయితే మీరు పామిడి మండలంలోని రామరాజుపల్లి గ్రామాన్ని సందర్శించి తీరాల్సిందే.
- పామిడి
పామిడి నుంచి గుత్తికి వెళ్లే దారిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రామరాజుపల్లి గ్రామంలో 350 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ 1,500 జనాభాకు గాను వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామంలో శతాబ్దాల క్రితం వెలసిన సుంకులమ్మ, ముత్యాలయ్య ఆలయాలు ఉన్నాయి. గ్రామంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా.. అమ్మవారికి మొక్కుకుంటే వెంటనే తీరుతుందని స్థానికుల ఆపార నమ్మకం. అంతేకాక తమ ఇంట ఆడపిల్ల పుడితే సుంకులమ్మ అని, మగ పిల్లలు పుడితే ముత్యాలయ్య అని పేరు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా ఒకే ఇంటిలో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికీ ఇవే పేర్లు ఉంటాయి. ఇలా గ్రామంలోని సగం మందికి ఈ తరహా పేర్లు ఉన్నాయి.