అదిరే స్థాయిలో రంభ రీ-ఎంట్రీ
ప్రముఖ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి, కుర్రకారుని ఉర్రూతలూగించిన రంభ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతోంది. రంభ అభిమానులకు ఇది శుభవార్త అయినప్పటికీ, మరో బాధాకరమైన వార్త ఏమిటంటే ఆమె భర్త నుంచి విడిపోయినట్లు తెలుస్తోంది. ఓ ఎన్నారై వ్యాపారవేత్తను పెళ్లాడిన రంభ ఒక ఆడపిల్లకు జన్మనిచ్చి హాయిగా కాపురం చేసుకుంటుంది. అయితే వారి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె స్వదేశానికి తిరిగి వచ్చి చెన్నైలోనే పుట్టినింట్లో ఉంటోందని తెలుస్తోంది.
గతంలో 'మేజిక్ వూడ్స్' అనే సంస్థకు రంభ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది. ఆ తర్వాత ఆ సంస్థ యజమాని, కెనడాలో స్థిరపడిన ప్రవాసభారతీయుడు, వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాథన్తో ప్రేమలో పడింది. 2010, ఏప్రిల్ 8న ఇంద్రన్ పద్మనాథన్ను వివాహం చేసుకుంది. వారి వివాహం తిరుపతిలో ఎంతో వైభంగా జరిగింది. పెళ్లి తర్వాత ఆమె భర్తతో కలిసి టోరంటో వెళ్లి పోయింది. సినిమాలకు స్వస్తి చెప్పి అక్కడే స్థిరపడింది. ఈ దంపతులకు 2011, జనవరి 14న ఆడ పిల్ల జన్మించింది. ఆ పాప పేరు లాశ్య. 2012లో కూడా రంభ తన భర్తతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో రంభ ఆ వార్తలను ఖండించింది. భర్త ఇంద్రన్, కూతురు లావణ్యతో టోరంటోలో సంతోషంగా ఉన్నానని అప్పట్లో వివరణ ఇచ్చింది. ఇటువంటి పుకార్లను నమ్మవద్దని అభిమానులను కోరింది. భర్త తరపువారు తనను బాగా చూసుకుంటున్నట్లు కూడా తెలిపింది. ఇప్పుడు మళ్లీ వారు విడిపోయినట్లు తెలుస్తోంది.
రంభ వందకుపైగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ చిత్రాలలో నటించింది. దక్షిణాది అగ్రహీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, మమ్ముట్టీ, బాలీవుడ్లో మిథున్ చక్రవర్తి, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, సునీల్ శెట్టి, విజయ్, గోవింద....... వంటివారి సరసన నటించి మెప్పించింది. అప్పట్లో రంభ తన అందంతో అభిమానులకు పిచ్చెక్కించింది. హావభావాలతో ఆకట్టుకుంది. ఇప్పుడు చెన్నైలో ఉన్న రంభ మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతోంది. వందకు పైగా చిత్రాలలో నటించిన రంభ తన రీ ఎంట్రీ అదిరిపోయేట్లు ఉండాలన్న ఆలోచనతో ఉంది. చిత్రంలో ప్రాధాన్యత గల కీలక పాత్ర, అవసరమైతే అక్క, వదిన వంటి పాత్రలు కూడా చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ జనాలు పలువురు సినిమా ఆఫర్లతో ఆమె వద్దకు వెలుతున్నారు. పలువురు నిర్మాతలు, దర్శకులు ఆమెతో చర్చలు జరుపుతున్నారు.
శింబు హీరోగా నటించే ఒక తమిళ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె శింబుకు అక్కగా నటిస్తున్నట్లు పరిశ్రమ వార్గాల బోగట్టా. సినిమాలో ఈ పాత్ర చాలా కీలకమైనది చెబుతున్నారు. కోలీఉడ్ నుంచే కాకుండా టాలీవుడ్ నుంచి కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. రంభ అంగీకరిస్తే ఆమె కోసమే ప్రత్యేకంగా కథలు రాయించి చిత్రాలు నిర్మించడానికి కొందరు నిర్మాతలు ముందుకు వస్తున్నారు.