రాష్ట్రం ఏర్పడ్డా నా గురించి ఆలోచించరేందిరా?
హైదరాబాద్ : సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాల్లో భాగంగా కీలకంగా భావించే 'రంగం' కార్యక్రమం సోమవారం ఉదయం ఉత్కంఠగా సాగింది. మాతంగి ఆలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
'తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా నా గురించి ఆలోచించరేందిరా?' అని ప్రశ్నించింది. 'నలుగురికీ అన్నం ముద్ద దొరుకుతుందనుకుంటే.. దోచుకునేటోళ్లు తయారయ్యారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అలాంటోళ్లను శిక్షించేదీ.. ప్రజలను కాపాడేదీ తానేని ఘంటాపథంగా చెప్పింది.
తన దగ్గరికి వచ్చే ప్రజలందరికీ ఎలాంటి భారంగానీ, భయాలుగానీ లేకుండా కాపాడుకుంటానని, ఆ బాధ్యత తనదేనని భక్తులకు భరోసా ఇచ్చింది. కాగా భవిష్యవాణి అనంతరం అమ్మవారిని అంబారీపై ఊరేగిస్తున్నారు. అంబారీ ఊరేగింపు తర్వాత అమ్మవారి దర్శనం ప్రారంభం కానుంది.