మోదీ రాముడైతే.. రావణుడెవరో తెలుసా?
వారణాసి: ఇండియన్ ఆర్మీ సర్జికల్ దాడులతో పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. ఆర్మీ సర్జికల్ దాదాడుల వీడియోలు విడుదలచేయాలంటున్న ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు.. దీనికి బీజేపీ ప్రతివిమర్శలు.. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో రాజకీయం కొత్త పోకడలు పోతోంది. బుధవారం వారణాసిలో వెలిసిన 'రాంలీలా' పోస్టర్ అందుకు నిదర్శనంగా నిలిచింది. బీజేపీ మిత్రపక్షమైన శివసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఏర్పాటుచేసిన పోస్టర్ లో ప్రధాని నరేంద్రమోదీని యుద్ధం చేస్తోన్న రాముడిగా చిత్రీకరించారు.
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను రావణాసురుడిగా పేర్కొంటూ.. 'ఓరీ.. రావణా కాసుకో.. ఇంకా ఒకేఒక్క సర్జికల్ స్ట్రైక్ బాణంతో నీ కథ ముగుస్తుంది'అని రాముడు(మోదీ) హెచ్చరిస్తున్నట్లు పోస్టర్లు వెలిశాయి. సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోలను విడుదల చేయాలని ప్రకటనలు చేస్తూ పలు విమర్శలకు గురయిన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను రావణుడి కొడుకు మేఘనాథుడిగా పేర్కొన్నారు. ఉగ్రవాది హఫీజ్ సయీద్ డిమాండ్ చేస్తున్నట్లే కేజ్రీవాల్ కూడా సర్జికల్ దాడుల సాక్ష్యాధారాలు అడుగుతున్నారని, ఒకరకంగా అది దేశద్రోహమేనని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి అన్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్నవేళ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఆపరేషన్ కు రాజకీయాలు జోడించి పోస్టర్లు రూపొందించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.