రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
నంబులపూలకుంట : నంబులపూలకుంట మండలం కొత్త రోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టి.ఎన్.కొత్తపల్లెకు చెందిన రామ్మోహన్‌రెడ్డి(30) దుర్మరణం చెందగా, మహేంద్రరెడ్డి అనే వ్యక్తి గాయపడినట్లు ఎస్ఐ రమేశ్‌బాబు తెలిపారు. వారిద్దరూ స్వగ్రామం నుంచి స్కూటీలో నంబులపూలకుంటకు బయలుదేరారన్నారు. మార్గమధ్యంలోని కొత్త రోడ్డు వద్దకు రాగానే ముందుపోతున్న వాహనాన్ని ఓవర్ టెక్ చేయబోయి అదుపుతప్పి పడిపోయినట్లు వివరించారు.
దీంతో రామ్మోహన్‌రెడ్డికి తీవ్ర గాయాలు కాగా, వెనుక కూర్చున్న మహేంద్రరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. వారిని ప్రైవేటు వాహనలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే రామ్మోహన్‌రెడ్డి మరణించినట్లు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.